బిజెపి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టం తీసుకొచ్చింది. చట్టం పేరును కూడా మార్చేసింది. Unified Waqf Management, Empowerment, Efficiency and Development అని కొత్త పేరు పెట్టింది. ప్రతిపాదిత సవరణలు చాలా పెద్ద చర్చకు దారితీసాయి. పార్లమెంటరీ జాయింట్ కమిటీ కూడా ఈ బిల్లు మీద చర్చలు జరిపి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. అయితే, పార్లమెంటు సభ్యులకు కూడా సవరణలు ప్రతిపాదించే అవకాశం లేకుండా బిల్లు ప్రతులను చివరి నిమిషంలో పంపిణీ చేశారని ప్రతిపక్షాల నాయకులు సభలో విమర్శలు చేశారు.
పాలక పక్షం ఈ బిల్లును సమర్ధించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నది. వక్ఫ్ భూములను రక్షించడం, అన్యాక్రాంతం కాకుండా నివారించే లక్ష్యంతో ఈ చట్టం తెచ్చినట్టు చెబుతున్నప్పటికీ, వాస్తవంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలోని 9లక్షల 40వేల ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఉద్దేశించిన చట్టమని అర్థం అవుతూనే వున్నది. ఇందులో భాగంగా బోర్డు సభ్యులుగా ముస్లింయేతరులను నియమించే ప్రొవిజన్సును ఈ చట్టంలో పొందుపర్చారు. ఇది అభ్యంతరకరమైన విషయం. వక్ఫ్ భూములంటే ముస్లింల ఆలయ భూములని అర్థం. హిందువులు భక్తితో ఆలయాలకు భూములను దానం చేసిన వాటిని దేవాలయ భూములని పిలుస్తారు. అవి అన్యాక్రాంతం కాకుండా దేవాదాయ శాఖ చూసుకోవాలి. అయితే, చాలా దేవాలయాల భూములు ధర్మకర్తలు, ఆలయ పూజారులు కలిసి అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు వున్నాయి. అలాగే, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పేదలు వాటిని సాగుచేసుకుంటూ యాజమాన్య హక్కుల కోసం పోరాడుతున్న సంగతి కూడా తెలిసిందే. అదే విధంగా వక్ఫ్ భూములంటే మసీదుల నిర్వహణ కోసం, ముస్లింలు దానం చేసిన భూములు అని అర్థం. అవి దేవుని మాన్యాలని అర్థం. వాటిని అమ్మే అధికారంగానీ, మరొకరికి బదలాయించే అధికారం గానీ ఆయా మసీదులకు వుండదు. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేసిన భూముల మీద దానకర్తలకు ఎలాంటి యాజమాన్య హక్కులుండవు. అలాగే, హిందూ దేవాలయాల భూముల మీద హిందూయేతరులకు ఎలాంటి అధికారం వుండన్నట్టే, ముస్లిం వక్ఫ్ భూముల మీద కూడా ముస్లిం యేతరులకు ఎలాంటి అధికారం వుండదు. ఇది 1995 చట్టంలో వున్నది. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంలో సెంట్రల్ వక్ఫ్ బోర్డులో ముస్లింయేతరులైన ముగ్గురు పార్లమెంటు సభ్యులు వుంటారు. అలాగే, రాష్ట్రస్థాయి వక్ఫ్ బోర్డులో కూడా ముగ్గురు ముస్లింయేతరులు వుంటారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా వుంటారు. వాళ్లు చట్టంలో నిర్వచించబడిన స్థాయి, హోదాగల వారై వుంటారు.
ఈ ప్రొవిజన్ మీద అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాటి మంచి చెడ్డల జోలికి పోవడం అవసరం లేదు కానీ, చాలా రొటీన్ లాజిక్కునే అన్వయించుకోవచ్చు. హిందూ దేవాలయాల నిర్వహణలో ఇతర మతాల అధికారులను నియమిస్తే అంగీకరించక పోవడం సహజం. గతంలో ఇలాంటి విషయాల మీద తీవ్రమైన వివాదాలు జరిగిన సంగతి విధితమే. కానీ వక్ఫ్ బోర్డులలో ముస్లింయేతరులను నియమించడాన్ని బిజెపి సమర్ధించుకోవడానికి చూపుతున్న కారణాలు వింతగా వున్నాయి. బోర్డుల నిర్ణయాలలో పారదర్శకత, దాని పనితీరులో సామర్ధ్యం పెంపు కోసమే ఈ ప్రొవిజన్ అనడంలోనే గడుసుదనం వుంది. వాస్తవానికి మసీదులకు దానం చేసిన ఆస్తులను ఇతరులకు కట్టబెట్టడానికి ఈ ఏర్పాటు అన్నది స్పష్టం అవుతుంది. న్యాయశాఖ మంత్రి పేర్కొన్న డ్రాకోనియన్ సెక్షన్ 40ని తొలగించారు. ఈ సెక్షన్ ప్రకారం ఎక్కువ కాలం ఉపయోగించుకున్న భూములు కూడా వక్ఫ్ భూముల పరిధిలోకి వచ్చేవి అని పాలక వర్గం ఆరోపిస్తున్నది. ఇందులో నిజానిజాలేమిటో తేలాలి. విషయం ఏమిటంటే, వక్ఫ్ బోర్డు జాబితాలో చేరని భూములు చాలా వున్నాయి. అవి వివాదస్పదంగా మారాయి. కోర్టుల్లో విచారణ దశలో వున్నాయి. అలాంటి భూములను ముస్లింలు కోల్పోతారు. వ్యాజ్యంలో వున్న వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులను నిర్ధారించడానికి జిల్లా కలెక్టరు లేదా తత్సమానమైన అధికారికి ఈ చట్టం అధికారం ఇచ్చింది. అయితే, బోర్డులో ముస్లింయేతరులున్నప్పుడు ఆ అధికారి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలడా? అనేది పెద్ద సంశయం.
ఈ కొత్త చట్టంతో వక్ఫ్ భూములు భద్రంగా వుంటాయనే భరోసా ఈ దేశంలోని పౌరులకు కలిగిందా అన్నది సంశయం. కార్పోరేట్ కంపెనీలకు వాటిని కట్టబెట్టే వెసులుబాటును ఈ చట్టం కలిపిస్తుంది.
ఒక చట్టాన్ని తయారు చేయడానికి ఎన్ని సాకులైనా చెప్పవచ్చు. కానీ అది అంతిమంగా ఏ వర్గానికి లబ్ది చేకూరుస్తుందనే వాస్తవం నిజానికి చట్టాన్ని తయారు చేసిన పాలకులకే ఎరుక. ప్రజలు ఆ నిజాన్ని వాసన పడుతారు. కానీ నిలువరించ గలరా?
` డా.జిలుకర శ్రీనివాస్
విసికె తెలంగాణ అధ్యక్షులు