Thursday, 25 July 2024

The Rise of Marvadis

 వ్యాపార విజయాలు మార్వాడీల సొంతం

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:05 AM


రాజస్థాన్. సారవంతమైన సేద్యపు భూములు లేవు, విశాల బాహ్య ప్రపంచానికి వెళ్లే నౌకాయాన మార్గాలు అంతకన్నా లేవు. అరబ్బు దేశాలలో వలే అత్యధిక ప్రాంతం ఎడారిగా ఉన్న భారతీయ సీమ రాజస్థాన్. ఒంటెలు ఒక ప్రధాన అంతర్భాగంగా...


వ్యాపార విజయాలు మార్వాడీల సొంతం

రాజస్థాన్. సారవంతమైన సేద్యపు భూములు లేవు, విశాల బాహ్య ప్రపంచానికి వెళ్లే నౌకాయాన మార్గాలు అంతకన్నా లేవు. అరబ్బు దేశాలలో వలే అత్యధిక ప్రాంతం ఎడారిగా ఉన్న భారతీయ సీమ రాజస్థాన్. ఒంటెలు ఒక ప్రధాన అంతర్భాగంగా ఉన్న రాజస్థానీయుల జీవన విధానం విలక్షణమైనది. తలవంచని వీరులు వారు. అలనాటి హల్దిఘాట్ యుద్ధం మొదలు నేడు తెలుగునాట పానీపూరి విక్రయాల వరకు అధిపత్య ఆరాటం ఆ భూమి పుత్రులలో ఉంది.



వాణిజ్య రంగంలో మార్వాడీల పాత్ర విశిష్టమైనది, అద్వితీయమైనది, చరిత్రాత్మకమైనది. పహేలే షా బాద్ మే బాద్ షా (మొదట షావుకారు ఆ తర్వాత రాజు) అనేది మార్వాడీల నానుడి. ఏ రాజ్యంలో మార్వాడీ వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆ రాజ్య ఆదాయం సమృద్ధమని కూడ అలనాటి కాలంలో రాజుల అభిప్రాయంగా ఉండేది. కాలం నాటి రాచరికం నుంచి ఈ నాటికీ వలస వ్యాపారులకు పర్యాయపదం మార్వాడీలు. అఫ్ఘానిస్తాన్ సుల్తాన్‌లు, హైదరాబాద్ నిజాం నవాబుల నుండి పిఠాపురం సంస్ధానాదీశుల దాకా చిన్న, పెద్ద పాలకులు అందరూ మార్వాడీలకు స్వాగతం పలికారు, ఆదరించారు, రాజ్య ఆదాయాన్ని పెంపొందించుకున్నారు. వర్తమాన భారతదేశంలో రాజస్ధానీలు ప్రత్యేకించి మార్వాడీల జైత్రయాత్ర ఆసేతు హిమాచలం, మరీ ముఖ్యంగా తెలుగునాట వ్యాపార సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తోంది.



ABN ఛానల్ ఫాలో అవ్వండి


వర్తక శ్రేష్టులు అయిన మార్వాడీలు గతంలో నగరాలలో ఆటోమోబైల్, హార్డ్‌వేర్, బంగారం, మిఠాయి ఇత్యాది వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. కాలంతో పాటు వారూ మారారు. గత కొన్నాళ్ళుగా గోదావరి నదీ తీరంలోని నిర్మల్ జిల్లా మొదలు పెన్నా నదీ తీరంలోని నెల్లూరు దాకా మార్వాడీల ఉనికి అనూహ్యంగా పెరిగిపోతోంది. ఈ సమూహాల వ్యాపార దక్షతను ఎదుర్కోలేక స్ధానిక సంప్రదాయక వ్యాపారవర్గాలు వెనుకంజ వేస్తున్నాయి. వ్యాపార రంగం నుంచి నిష్క్రమిస్తున్నాయనడం సత్య దూరం కాదు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నూతన, వినూత్న వ్యాపార పద్ధతులతో మార్వాడీలు తమకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకుంటున్నారు. స్వేచ్ఛా విపణిలో తామెందుకు వెనుకబడిపోతున్నామనేది తెలుగు వ్యాపారవేత్తలు ఒకసారి సమీక్షించుకోవల్సిన సందర్భమిది.



ఒక వైపు ఈ–కామర్స్ విజృంభణ, మరో వైపు యువతరం నిరాసక్తికి తోడుగా మార్వాడీల విస్తరణ ఫలితంగా తెలుగునాట సామాజిక జీవనంలో ఒక భాగమైన సంప్రదాయ షావుకారు దుకాణాలు సన్నగిల్లుతున్నాయి. సారవంతమైన సాగు భూములు, పుష్కల వ్యాపారవకాశాలు ఉన్నా తెలుగు ప్రాంతాలకు చెందిన అసంఖ్యాక యువజనులు విదేశీ కొలువుబాట పడుతున్నది. వాణిజ్యమే వృత్తిగా ఇప్పటి వరకు రాణించిన వైశ్య యువత కూడ పెద్ద సంఖ్యలో దేశ సరిహద్దులు దాటుతోంది. వ్యాపారంలో అడుగుపెట్టడానికి ఇతర సామాజిక వర్గాల యువత సాహసించలేకపోతుంది. స్వంత గడ్డపై స్ధానికులు నిస్సహాయ స్ధితిలో సతమతమవుతుండగా ఎక్కడి నుంచో గంపెడంత ఆశతో తెలుగునాటకు వచ్చిన మార్వాడీలు వ్యాపార విజయాలతో పురోగమిస్తున్నారు.


రాజస్ధానీ వ్యాపారులతో పాటు వారి గద్దీలు (గుమాస్తగిరి)లలో పని చేస్తున్న రాజస్ధానీ యువకుల సంఖ్య కూడ అనూహ్యంగా పెరిగిపోతోంది. తమ సేట్‌ల దుకాణాలలో గద్దీలపై గుమాస్తాలుగా పని చేస్తున్న ఆ యువకులు అనతికాలంలో సేట్‌లుగా ఎదుగుతూ స్వంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. తమ సేట్‌ల గద్దీలలో యాజమానుల పట్ల నిబద్ధత, విధేయతతో పని చేసే ఈ యువకుల నుంచి తెలుగు యువకులు నెర్చుకోవల్సింది చాలా ఉంది.



గల్ఫ్ దేశాలలో కోట్లకు పడగలెత్తిన విదేశీ వాణిజ్యవేత్తలలో కేరళలోని మలబార్ ప్రాంతీయులు, యుద్ధ పీడిత యమన్‌లోని హద్రమౌత్ ప్రాంతీయులు అగ్రగాములు. రిటైల్ రంగంలో వీరి పాత్ర ప్రముఖం. ప్రస్తుతం తెలుగునాట మార్వాడీల జయప్రద వ్యాపార సరళి కూడ సరిగ్గా అదే. సుదీర్ఘ కాలంగా ప్రజాజీవితంలో ఉన్నప్పటికీ ఇంత వరకు మజ్లిస్ నాయకులు ఎవరూ కూడ తెలుగు భాషను నేర్చుకోలేదు. అయితే రాజస్థానీ వ్యాపారస్తులు, వారి గద్దీ గుమాస్తాలు అందరూ తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలగడం విశేషం. గల్ఫ్‌లో మలయాళీల విజయం వెనుక అరబ్బి భాషా కౌశలాలు ఉన్నట్లుగా తెలుగునాట రాజస్ధానీలు ముందడుగు వేయడానికి వారు తెలుగు భాష నేర్చుకోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మార్వాడీల వ్యాపార విస్తరణపై అసహనం వ్యక్తం చేసే వారు, ఆ వ్యాపార దక్షుల విజయ రహస్యాలను తెలుసుకోవడం మంచిది. ఒకప్పుడు తిరుపతిలోని చిన్న బజారు లేదా హైదరాబాద్‌లోని బేగం బజారు లేదా గుల్జార్ హౌజ్‌కు మాత్రమే పరిమితమైన మార్వాడీలు నేడు మదనపల్లె, జగిత్యాల తరహా పట్టణాలకు విస్తరిస్తున్నారు మరి. అసూయపడితే ఎవరికి నష్టం? స్థానికేతరులు అయిన మార్వాడీలు అలా ముందంజ వేయడానికి దోహదం చేస్తున్నవేమిటో ఆకళించుకోవాలి.



ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ ఫలితంగా మాతృభాషా సంస్కృతులు ఉపేక్షింపబడుతున్న ప్రస్తుత తరుణంలో మార్వాడీలు ఎక్కడ స్థిరపడినా తమ భాషా, సంస్కృతులను సంరక్షించుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మార్వాడీ మహిళలు పాటించే అథ్యాత్మిక చింతనా ప్రపత్తులు, సంప్రదాయాలు అందరికీ ఆదర్శప్రాయం కావాలి. వ్యాపార రంగంలో మార్వాడీలను విమర్శిస్తున్న వారు భవన నిర్మాణ రంగంలో ప్రబలుతోన్న ఉత్తరప్రదేశ్ వృతి నిపుణుల గురించి ఏమంటారు? రాజస్ధానీ మార్వాడీల, లేదా కేరళ మలబారీల సాఫల్య బాటను అనుసరించి తెలుగు యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి, వీలయితే సృష్టించుకోవాలి. విదేశీ వలసలలో తెలుగువారు ఉపాధి రంగంలో రాణించినట్లుగా మార్వాడీలు వ్యాపారాన్ని ఎంచుకుని అందులో రాణిస్తున్నారు.


మొహమ్మద్ ఇర్ఫాన్


(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

No comments:

Post a Comment