Friday, 6 October 2023

Poodoori Rajireddy - దుల్లాహి, శిర్క్

 దుల్లాహి, శిర్క్

(ఇటీవల జరిగిన ‘రైటర్స్‌ మీట్‌’ సమావేశంలో ‘ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న’ అన్న అంశం మీద నేను మాట్లాడాల్సి ఉండింది. కానీ అది సజావుగా సాగలేదు. అక్కడ మాట్లాడాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)

ఒక గ్రీకు తత్వవేత్త ఏమంటాడంటే– మనిషికి గనక గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండివుంటే, దేవుడికి కూడా అదే గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండేవి అని! అంటే మనిషి తన రూపంలోనే దేవుడిని సృజించుకున్నాడు. మనుషుల దేవుడు మనిషి రూపంలో ఉంటాడు; చీమలకు కూడా దేవుడు ఉంటే చీమల ఆకారంలో ఉంటాడు కావొచ్చు; ఎవరికి తెలుసు? 

మనకు తెలిసినంతలో అన్ని మతాల దేవుళ్లకు, లేదా వాళ్లు భక్తిగా కొలిచేవాళ్లకు ఒక ఆకారం ఉంది. ఒక ఇస్లాంలోనే దేవుడికి రూపం లేదు అనేది ఒక శాసనంలా ఉంది. దేవుడు నిరాకారుడు, సర్వాంతర్యామి అని హిందూమతపు పుస్తకాల్లో కూడా ఉంటుంది. కానీ హిందూమతం అనేది స్థిరపడినది కాదు; పరిణామం చెందుతూనే ఉండేది కాబట్టి, దాన్ని ఇదీ అని వ్యాఖ్యానించడం కష్టం. ప్రస్తుత రూపంలో ఉన్న హిందూమతంలో అయితే దేవుళ్లకు కచ్చితమైన ఆకృతి ఉంది. ఇస్లాంలో మాత్రమే విగ్రహారాధన లేదు. ఒక హయ్యర్‌ పవర్‌ను రూపరహితంగా ఆరాధించడం అనేది కూడా నాకు మంచి భావనగానే కనబడుతుంది. 

మతం అనేది మన జీవితాల్లో చాలా ప్రధానమైనది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నామకరణం, వివాహం నుంచి, మన జీవితంలో ఉన్న అన్ని వ్యవహారాలు మతం ఆధారంగానే నడుస్తాయి; ఆఖరికి అంత్యక్రియలతో సహా. మతం లేదా దేవుడితో ముడిపడి మనకు ఇంజనీరింగ్‌ వర్ధిల్లింది. కళలు వర్ధిల్లినై. సాహిత్యం వచ్చింది. ఈస్తటిక్‌ సెన్స్‌ వృద్ధి అయింది. మతంతో ముడిపడిన నిర్మాణాల కోసం మనుషులు తమ జీవితాలను ధారపోశారు. ఉదా: సిస్టీన్‌ చాపెల్, ఖురాన్‌ కాలిగ్రఫీ, దేవాలయాల్లోని శిల్పాలు. హ్యూమన్‌ ఎండ్యూరన్స్‌ అనేదానికి మతం  ఒక పరీక్ష. మనకు మనం మతానికి ఎంతగా ఇచ్చేసుకున్నామంటే– ఇంక దేవుడు లేడు అంటే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధం లేనంతగా.

మతం, దేవుడు రెండింటినీ సందర్భాన్ని బట్టి ఒకే అర్థంలో వాడుతున్నాను. ఒక్కో మతంలో దానివైన సమస్యలున్నాయి, దానివైన వివక్షలున్నాయి, దానివైన సానుకూలతలు ఉన్నాయి, దానివైన అతిశయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు  అప్రస్తుతం. ప్రపంచంలోని అన్ని మతాలు వేరు, ఇస్లాం వేరు అని చెప్పాలన్నది నా ఉద్దేశం. దేవుడిని రూపరహితంగా ఆరాధించడం ఒక్కటే ఇస్లాంను వేరుగా ఉంచడం లేదు. ‘మతేతరుల’ గురించి ఇస్లాం మాత్రమే నొక్కి మాట్లాడుతుంది. అత్యాధునిక మతం కావడం వల్ల కూడా ఇది జరిగివుండొచ్చు. 

ముందుగా ఒకటి చెప్తాను. మనలో ద్వేషం ఎప్పుడూ ఒక ఊహా దయ్యం ఆధారంగా పనిచేస్తుంది. చాలావరకు మన లక్ష్యిత గ్రూపు ఏమిటో తెలియదు కాబట్టే, ఏ అడ్డు లేకుండా వ్యాఖ్యానాలు చేయగలుగుతాం. కానీ దీని ప్రతిఫలనం ఫలానా వాళ్ల మీద ఉంటుంది అని కచ్చితంగా తెలిసినప్పుడు అది మనకు ఒక నియంత్రణ రేఖలా పనిచేస్తుంది. అందుకే నేను నా ముస్లిం స్నేహితులను తలుచుకుంటూ దీన్ని మొదలుపెడుతున్నాను. ఇది ఏ ఒకరిద్దరు ముస్లిం రచయితల గురించో  కాదు. వీరి సాకుగా నాకున్న కన్సెర్న్స్‌ను ముస్లిం కమ్యూనిటీలోని ఆలోచనాపరుల ముందు పెట్టాలన్నది నా ఆలోచన. 

ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొన్నమొన్నటిదాకా హనుమంతుడి వాహనం ఒంటె అని తెలియదు. చిన్నప్పటినుంచీ హనుమంతుడు ఎగురుకుంటూ వెళ్తాడనే తెలుసు. పుట్టుకతో హిందువును అయినప్పటికీ ఇంత చిన్న విషయం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మతాల మీద, మత సాహిత్యం మీద నేనేమీ అథారిటీ కాదు అని ఒప్పుకోవడానికి. ఇంక నేను మాట్లాడుతున్నది పొరుగు మతం గురించి కాబట్టి, నా అవగాహన పరిమితుల మీద నాకు స్పృహ ఉంది. 

‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆ¯Œ . ఈ ఒక్క వాక్యం వల్ల ప్రపంచంలోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పినవాళ్లు అవుతున్నారు. ఇంకా ఖురాన్‌ ఏం చెప్తున్నదంటే– అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం (శిర్క్‌) అంటుంది. 

ఇస్లాం మొత్తం పునాది ఈ భావనల మీద ఆధారపడి ఉంది. ఈ లెక్కన ఎంతమంది ఈ మహాపాపం చేస్తున్నట్టు? ఎందుకంటే ప్రతి మనిషీ ఏదో ఒక మతంతో అసోసియేట్‌ అయివున్నాడు కదా. అతడు ఆదివారం చర్చీకి పోతుండవచ్చు, గురువారం సాయిబాబా గుడికి పోతుండవచ్చు, కట్ట మైసమ్మకు కొబ్బరికాయ కొట్టివుండొచ్చు. వీళ్లందరూ మహాపాపులే. వాళ్లను ఏం చేయాలి? ధర్మయుద్ధం. ఇదిగో ఇక్కడుంది సమస్యంతా! దీనివల్ల ఇతర మతాల వారి ఉనికి ప్రమాదంలో పడుతోంది.

ముస్లింలలో తార్కిక ఆలోచనలు కలిగినవాళ్లు లేరా? మనుషులు సామరస్యంతో సహజీవనం చేయడమే అత్యుత్తమ విలువ అని వారికి తెలియదా? అత్యధికులు పరమత సహనం ఉన్నవాళ్లు కాబట్టే, శాంతియుతంగా బతకగలుగుతున్నాం. కానీ ఎవరైనా ఈ భావనలను మానవాళికి వ్యతిరేకంగా అన్వయించుకునే వీలు లేదా?

ఇదిలా ఉంటే, మన రచయితలు ముస్లింవాద సాహిత్యం అంటుంటారు. అలాంటప్పుడు ఈ భావనల మీద వీరి వైఖరి ఏమిటి? ఇవన్నీ తెలిసే ముస్లింవాదమా? మెజారిటీవాద రాజకీయాల్లో మా బతుకుల గురించి మేము చెప్పుకుంటున్నాం అని వాళ్లు అనొచ్చు. కానీ ప్రపంచ లెక్కల్లోకి పోతే ఈ వాదం తేలిపోతుంది. హిందుత్వ రాజకీయాలను శత్రువుగా భావిస్తున్నప్పుడు, ఇస్లాం ఛాందసం కూడా ఇంకొకరికి శత్రువుగా ఉంటుందన్న అవగాహన వీరికి ఉందా? ఎందరెందరినో మీరెటువైపు అని నిలదీసిన నేల కదా ఇది! ఇప్పుడు నేను అడుగుతున్నాను. ముస్లిం రచయితలు, మేధావుల్లారా, మీరెటు వైపు? మనం ఏ మతంలో ఉన్నా అందరమూ కలిసిమెలిసి ఉండాలన్న అవగాహన వైపా? లేక, మా మతమే మిన్న, తక్కినవి సున్నా అని మీరు కూడా మనసులో అనుకుంటున్నారా? 

రెండోది మీ అభిప్రాయం అయితే, మీరు హిందుత్వ రాజకీయాలను ప్రశ్నించడంలో అర్థం లేదు. మీ అవగాహన మొదటిదే అయితే, మీ ఇస్లామేతర సహోదరుల కోసం మీరు ఏం చేస్తారు? 

మతాలు తీవ్రరూపం దాలుస్తున్న కాలంలో ఉన్నాం. మనుషులు దేవుడి పేరుతో మృదువుగా కావాల్సింది పోయి, కఠినం అవుతున్నారు. ఎక్స్‌ట్రీమ్స్‌కు పోతున్నారు. మధ్యేమార్గం అనేది లేకుండా పోతోంది. ఎందుకంటే మతం అనేది ఆధ్యాత్మిక సాధన కోసం కాదు. అది ఒక రాజకీయం. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కానీ మనకు డిస్కోర్స్‌ ఎట్లా సెట్‌ అయివుందంటే, నిద్రలేస్తూ పాచిపళ్లతో కూడా హిందుత్వ అని తిట్టొచ్చు. కానీ స్నానం చేసి ఒళ్లంతా దగ్గరగా పెట్టుకుని కూడా ఇస్లాం ఛాందసం గురించి మాట్లాడకూడదు. దీనికి చాలావరకు మన వామపక్ష మేధావులు కారణం. ఎందుకంటే, మన దగ్గర ప్రతి చర్చనూ నడిపేదీ, ఏది ప్రగతిశీలమో, కాదో నిర్ణయించేదీ వాళ్లే. కానీ ఈ విషయంలో వాళ్లు ఉండాల్సినంత ఫెయిర్‌గా లేరని నా అభిప్రాయం. హిందుత్వ అని వామపక్షీయులు మాట్లాడకుండా ఏ దినపత్రిక అయినా ఏ ఒక్క రోజైనా ఉంటుందా? మరి ఇస్లాం ఛాందసం మీద వీళ్లు ఎంత మాట్లాడుతున్నారు? పైగా ఇలాంటి అంశం ఎత్తితే, అసలు విషయాన్ని పక్కనపెట్టి, స్టాంపు గుద్దడానికి ముందు సొరుగులోంచి ఇంక్‌ ప్యాడ్‌ తీస్తారని కూడా తెలుసు. కానీ మతం ఏదైనా సాటి మనిషితో ఆదరంగా ఉండాలన్నదే నా అభిమతం. మతం అని ఇక్కడ సందర్భవశాత్తూ వాడటమే గానీ, ప్రతి మనిషితోనూ వీలైనంత మంచిగా ఉండాలన్నది నా వ్యక్తిగత సంకల్పం, సాధన!

Ratnaji Nealapuri

Reply

2h

Raghu Seshabhattar

శభాష్ 🌹👍

Reply

2h

Datla Devadanam Raju

మంచి మాటలు చెప్పారు. అక్కడ చెప్పే వీలు లేకుండా పోవడమే మంచిదయ్యింది Poodoori Rajireddy గారూ

Reply

2h

Venkateswaran Rushinarada Subramanya

అక్కడ చెప్పి ఉంటేనే బాగుండేది. సంక్షిప్తమైన వ్యాసం అయినా ముస్లింవాదులు, ముసల్మానులు కూడా ఈ దుల్లాహి, శిర్క్ లపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి.

Reply

2h

Kaanchanapalli Govardhan Raju

మంచి మాటలు, అభినందించకుండా ఉండలేను.

Reply

2h

Prasad Palakurthy

చాలా బాగా రాసారు సార్....

అందరం కల్సి మెల్సి ఉండాలన్నా అవగాహనా ముస్లింవాద రచయితలది,మేధావులది ఐతే చందసావాదా ముస్లిం లలో మార్పు తెచ్చే రచనలు కానీ, ఆహ్ దూల్లాహి, శీర్క్ ను వ్యతిరేకించే రచనలు గాని మీరు చేసారా? మేధావులు మాట్లాడుతున్నారా ? మా మతం లో ఆ అవకాశం లేదు దాడులు చేస్తారు అనే తప్పించుకునే ధోరణి కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ హిందూ చందసవాద చేతుల్లో దాడులకు గురైన చాలా మందిని ఈ సందర్బంగా గుర్తు తెచ్చుకొని సమాధానం ఇస్తే సంతోషం...

Reply

1h

Bp Padala

ముస్లిం వాదం కన్నా వామపక్షేయుల తీవ్ర వాదం ఈ దేశానికి తీరని హాని చేసింది , చేస్తుంది .

You took the bull by horns 👍

Reply

1h

Edited

ఖుర్షీద్ సయ్యద్

Reply

1h

Gudipati Venkat

హనుమాన్ వాహనం ఒంటె అని ఇప్పుడే తెలిసింది. కానీ ఎన్ని ముద్రలు వేస్తారో ఇక రెడీగా వుండండి.

Reply

1h

Sujatha Velpuri

వామ పక్ష వాదులు, వాళ్లకు కనపడేదే ప్రపంచమంతటా ఉందని , ఉండాలని భావిస్తుంటారు. ఇటువైపు వాడు ఏం చెపుతున్నాడో చెవిన వేసుకునేదే లేదు

అయితే నాదొక ప్రశ్న. “అల్లాహ్ దాస్యమే చేయాలని, ఆయనకే విధేయులై ఉండాలని మానవ జాతి అల్లాహ్ కి ఇచ్చిన ప్రమాణం” అనే వాక్యం వల్ల ప్రపంచం లోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పుతున్నారు”

??

మానవ జాతి అంటే ఇస్లాం లో అర్థం, మానవులందరూ అని అర్థమా లేక ఇస్లాం ని పాటించే వారా?

ఈ లెక్కన మన హిందూ మతంలో కూడా “సకల చరాచర జగత్తు ని పాలించే” వాడిగా , ప్రపంచమంతా ఆయన బిడ్డలు గా విష్ణువుని, జీవులన్నిటి లెక్కలూ చూసే వాడిగా శివుడి ని ఆరాధిస్తాం కదా! మరి ఆ సకల చరాచర జగత్తు , అన్ని జీవుల్లో ముస్లిమ్స్ ఉన్నట్టా లేనట్టా ?

మిగతా మతాలు , మతస్థులు ఉన్నారని తెలిసీ ఖురాన్ ఈ విధంగా జనరలైజ్ చెయ్యదని అనుకుంటున్నాను. చేసినట్లయితే ఆ జనరలైజేషన్ హిందూ మతానికి కూడా వర్తిస్తుంది గా?

ఛాందస వాదం ఎక్కడ ఉన్నా ఖండించ వలసిందే గానీ 80% హిందులున్న దేశంలో , మైనారిటీలు గా ఉన్న ముస్లిమ్స్ తమ గొంతును గట్టిగా వినిపించటంలో, తమ అస్తిత్వ ప్రకటన చేసే క్రమంలో కొంత ఛాందసంగా ధ్వనించటం సహజమేనేమో కదా

మీ నీయత్ మీద సందేహం లేదు . మనుషులంతా సామరస్యంగా ఉండటమే ఎవరమైనా కోరుకునేది

Reply

1h

Edited

Harshaneeyam S

Very measured, balanced,thought provoking , nuanced point of view🙏

Reply

1h

Abdul Rajahussain

  · 

సగం తెలుసు..సగం తెలీదు..వెరసి మీరు

చెప్పదలుచుకున్నది మీరు చెప్పారు.మీ అవగాహన

కో నమస్కారం.ఇలాంటి విద్వేష రచనలు మానుకుంటే మంచిది..వీటివల్ల నిజాలమాటెలావున్న సమాజంలో పెద్ద చిచ్చు పెట్టడమే.ఇతర మతాలను ద్వేషించమనిఖురాన్ లో

ఎక్కడుంది.ఖురాన్ మొత్తం ఆకళింపు చేసుకున్న ముల్లాలా రాశారు.‌మీరెప్పుడైనా ఖురాన్ చదివారా?

మీరచనవల్ల మీరు చదవలేదని అర్ధమవుతుంది.

తెలుగు అనువాదాలు దారుకుతున్నాయి..చదవండి.

మతపరమైన విషయాలు చాలా సున్నితమైనవి

వాటిని గురించి రాసేటప్పుడు సాధికారత అవసరం.

అది మికులేదని వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఈ వ్యాసమే ఉదాహరణ‌.ఇంకాచాలా వున్నాయి‌.

మీ వ్యాసంలో దోషాలు.‌ముస్లిం రచయితలు

అందరూ ఇస్లాం గురించి,మతం గురించి రాయడం లేదే..

ఒక మతం నుంచి మీకు అప్లాజ్ వస్తుంది.మిమ్మల్ని

మెచ్చుకుంటూకీర్తిస్తారు..అదంతా నిజం కాదు.

జాగ్రత్త..‌.థ్యాంక్యూ..!!

Reply

1h

Ranganadham Gara

బాగా రాశారు. అసలు మతమే మూఢం. మతముల న్నియు మాసిపోవును....

Reply

1h

Abdul Rajahussain

  · 

బేసిగ్గా..మీ ప్రశ్నే తప్పు‌

ముస్లిం రచయితలందరు ఇస్లాం గురించి

రాస్తున్నారా? వాళ్ళేమైనా ముల్లాలా?

మీకెవరు చెప్పారండీ! ముస్లిం రచయితంటే

మతప్రవక్తలా...ఏమిటండి బాబు పిచ్చి మాటలు.

పిడి వాదాలు..అందర్నీ ఒకే గాట కట్టేస్తున్నార

గడ్డం పెంచుకున్నోడల్లా సాయిబు కానట్లే

ముస్లిం రచయితలందరూ మతవాదులు కారు

Reply

58m

Akula Amaraiah

కమ్యూనిస్టులు ఇస్లాం తీవ్రవాదం మీద, ఛాందసం మీద మాట్లాడటం లేదనదేది తప్పు. రెండోది.. కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ వ్యతిరేకులు ఏమి ఆరోపణలు చేస్తున్నారో మీరూ అదే పని చేశారు కాస్తంత కళాత్మకంగా..

మతం ఏదైనా మత్తుమందు లాంటిదని కమ్యూనిస్టులు లేదా మీరనుకున్న వామపక్షీయులు ఆది నుంచి చెబుతూనే వచ్చారు. మీది వ్యక్తిగత సంకల్పం. వారిది వ్యవస్థాగత సంకల్పం. ఈ మాత్రం వాదన చేయడానికి మీరెత్తుకున్న ఎత్తుగడ బాగుంది..

Reply

44m

Viswanath Reddy

చాలా బాగా చెప్పారు రాజిరెడ్డి గారు

Reply

41m

Aditya Korrapati

చాలాసార్లు మతాలు, కనీసం వాటి ఆరంభ దశలో, అన్యమతాలు పాటించే వాళ్ళు ఉంటారు అనే అసంప్షన్ తో ఆపరేట్ చేయవు (మౌనమన్నా పాటిస్తాయి, లేదా తీసి పారేసినట్టు మాట్లాడతాయి, గ్రీక్ ల మతాన్ని క్రైస్తవంలో pagan అన్నట్టు). ఏది చెప్పినా మానవాళి మొత్తానికి జరిగినట్టే, వర్తించినట్టే చెబుతాయి. వాటికి భౌగోళికమైన, సామాజికమైన సరిహద్దులు ఉన్నట్టు గుర్తించవు (అవి నిర్దిష్ట స్థల కాలాల్లో, భౌగోళిక పరిస్థితుల్లో వికసించినప్పటికీ). ప్రతి మతం యూనివర్సల్ క్లైమ్స్ యే చేస్తుంది.

ఇక విశ్వాసులు- అవిశ్వాసులు అనే భావమే ఉంది. ఒక్కొక్క మతంలో దీని తీవ్రత స్థాయిల్లో భేదం కచ్చితంగా ఉంది. ఉదాహరణకి భారతదేశంలో ఒకప్పుడు నాస్తికులు అని దేవుడు లేడనే వారిని కాక వేదాన్ని అంగీకరించని వారిని అన్నారు.

అయితే, ఇస్లాం కూడా స్తబ్ధంగా ఉందని అనుకోడానికి లేదు. Introspection చేసుకుంటూనే ఉంది. గ్రంథాలకి, రోజువారీ అనుష్ఠానానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు చెప్పిన ఛాందసం లేదని తప్పించుకోలేం. అయితే ఛాందసం అంటేనే ఛందస్సు ని అంటే అక్కడ రాసిన/చెప్పిన మాటను పట్టుకు వేలాడేది అని. అంటే లిటరల్ గా చదవడం అని. లిటరల్ గా చదవడం నుంచి బయటపడితేనే కదా సాహిత్యవేత్త అయ్యేది.

ఇంకో అంశం ఏమంటే, బాహాటంగా ఒక వైఖరి తీసుకోవడం అంత సుగమం కాదు, అంతరంగంలో ఏమి అనుకున్నా. Brute force ముందు లాజికల్ మాటలు పని చేయవు.

Reply

34m

Edited

Sreerama Murthy

అన్ని మతాల్లోనూ తీవ్రమైన దుర్మార్గాలు లోపాలు ఉన్నాయి, స్త్రీల విషయంలోనైతే మరీను, ఆర్ ఎస్ ఎస్ అధినేత అయితే వారు ఇంట్లో ఉండి మగవాడికి అనుకూలంగా మెసులుకోడమే మంచిది అంటారు. అఫ్ఘాన్, ఇరాన్ మహిళల బాధల గురించి ముస్లిం రచయితలు పెద్దగా రాయరు. మధ్యలో వామపక్షాలు చేసిన నేరమేమిటి, సమాజం మారాలని ఆశిస్తూ వారు రాసిన రాతలు నినాదప్రాయంగా ఉన్నాయని ముద్ర వేసి సాహిత్యంలో సామాజిక చైతన్యానికే చోటు లేకుండా అనుభూతి వాద దుడ్డుకర్రతో వారిని మోదేశారు. యువ కవులు అమ్మ కవితలు, నాన్న సెంటిమెంట్ల చుట్టూ మౌస్ లు రాపాధించేలా చేశారు. దేశం లో ముస్లిం లు తమ బాధలనుంచి తాము బయటపడలేక చేస్తున్నారు. ఇతర విశ్వాసులను ద్వేషించే తీరిక వారికెక్కడిది. అమెరికా అధునిక సామ్రాజ్యవాదం వారిని ఎన్ని రకాలుగా రక్కి రక్కి నెత్తురోడేలా చేస్తున్నదో చూస్తూనే ఉన్నాము. ఇరాక్, లిబియా, పాలస్తేనా వంటి ఉదాహరణలెన్నో. తమ దేవుడు మాత్రమే దేవుడు ఇతరులు కారు అనేది అన్ని మతాల్లో ఉన్న జాడ్యమే. ఇస్లాం మీద ఇతరులందరూ పగబట్టినప్పుడు వారు మత ప్రాతిపదిక పై ఏకమై తమకు తోచిన పధ్ధతిలో తిరగబడితే తప్పేముంది? ఇండియాకు సమ్మంధించినంత వరకు ముస్లిం లు మైనారిటీలు, అల్ప సంఖ్యాకులను తమ్ముళ్లను చూసుకున్నట్టు చూసుకోడం మెజారిటీ బాధ్యత. ఆ దృష్టితో వ్యవరించే వామపక్షాలను విమర్శించడం హిందుత్వ వాదులకే చెల్లు

Reply

33m

Ravi Sangeveni

చాలా గొప్పగా.. నిర్మొహమాటంగా చెప్పారు..👌👍💐💐

Reply

29m

Lolaa Ravi Kumar Kosuri

చాలా బాగా రాసిన రైటప్. బహుశా ఇక్కడ కొందరికి నచ్చకపోవచ్చు. కానీ లైక్ మైండెడ్ గుంపుకూడా చాలా మందిమే ఉన్నాం. మీలాగే నేనుకూడా మతం ఏదైనా కానీ రాంగ్ గైడెన్స్ ని ఇవ్వకూడదు. మనిషిలా బతకడం‌నేర్పితే చాలు. లేదా మనిషిని మనిషిలా బతకనిచ్చినా చాలు.

Reply

23m

Vijaya Rama Raju

మతం పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అనే ఇంగితం కరవవుతోంది. స్వంత మతంలో వున్న మురికి కడుక్కోవడం మాని ఇతరులది కడగటం గురించి ఆలోచించడం వల్లే సమస్యలు. అలాగే కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచ వ్యాపితంగా మత ఛాందసత ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పాటు, వాటి ఆధారంగా అధికారంలోకి రావడం సులభమనే అనే ఆలోచనలకు రాజకీయ పార్టీలు వస్తున్నాయి. ప్రతి మతంలోను సంస్కరణ వాదులు, ఛాందస వాసులు ఉంటారు కానీ ఎవరిని encourage చేయాలో కూడా మన ఇంగితమే. మన మతం పేరుతో చేసే దుందుడుకు చర్యల వలన,ఆధునిక ప్రపంచంలో ఇతర దేశాల్లో బతుకుతున్న సామాన్య జనం పరిస్ధితి గురించి అన్ని మతాల వ్యక్తులు ఆలోచించాలి.

Reply

22m

Jeevan Reddy Puduri

రైటర్స్ మీట్ లో ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న.. అనే దగ్గరినే సజావుగా సాగలేదు.. అని మీరు పేర్కొన్నారు.. అలాంటప్పుడు ముస్లిం రచయితలను ప్రశ్నించడం సాధ్యమే కాదు. ఆ చర్చలు ఎప్పుడు జరగనివ్వరు కూడా ... మీ వ్యక్తిగతంగా అందరితో కలిసిమెలిసి ఉండటం అయితే...ఖచ్చితంగా హిందుత్వ రాజకీయం చేయడం.. మనతో కలిసిమెలిసి ఉండేవారితో మనం కలిసిమెలిసి ఉండడం.. అనేది నా అభిప్రాయం... పోస్ట్ చాలా బాగుంది బాబాయ్..

Reply

18m

Sadlapalle Chidambara Reddy

చాలా చక్కగా వివరించారు. చెడు వాసన వేసే ప్రతి మతాన్నీ నీలదీయాల్సిందే. కానీ ఇక్కడ మనం ఎంతకు దిగజారామ్ అంటే ఎవరైనా తప్పుచేస్తే దాని ఆధారంగా స్పందించ కుండా.... కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని,.... వెతికి తప్పుతో సంబంధం లేకుండా వెనకేసుకు రావడం పెద్ద రిగంగా తయారయ్యింది. చీకటి యుగం నుంచి ఎన్నో పరీక్షలలో రాటు తేలి 21 వ శతాబ్ధికి వచ్చినా ఇంకా మంద బుద్ధి పోలేదు. సొంత ఆలోచనల వ్యక్తిగా విశ్వ మానవునిగా ఎదగడానికి ఇంకా ఎంత సమయం కావాలో??????

Reply

3m



No comments:

Post a Comment