*ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) భారత్ బచావోతో కలిసి పనిచేస్తుంది*
ఉపన్యాసకుల్లో మొదటిరోజు, ప్రొఫెసర్ అపూర్వానంద చాలా గొప్పగా ఆకట్టుకున్నారు. దంతేవాడకు చెందిన హిమాంశు కుమార్ ప్రసంగం ఉద్వేగంగా సాగింది. రచయిత్రి సీమా ఆనంద్ ప్రసంగం ఆలోచించదగ్గట్టుగా వుంది. రెండో రోజు దీపాంకర్ భట్టాచార్య, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ప్రసంగాలు బాగున్నాయి.
ఈ కీలక పత్రం 1983కు ముందు భారత సమాజం మీద వివిధ కమ్యూనిస్టు పార్టిలకున్న అవగాహనను ప్రతిబింబించింది. భారత సమాజాన్ని అర్ధం చేసుకోవడంలో గత నలభై ఏళ్ళుగా సాగుతున్న పరిశోధనల అభివృధ్ధిని సాధించిన అవగాహనని భారత్ బచావో అవగాహన పత్రం నిరాకరించింది. అంటే, భారత్ బచావో అవగాహన పత్రం దాదాపు నలభై యేళ్ళు నెగటివ్ విలువలో వుంది.
ప్రొఫెసర్ అపూర్వానంద దేశంల్లో ముస్లింలను లక్ష్యాంగా పెట్టుకుని ఎంతటి క్రూరమైన దాడులు జరుగుతున్నాయో సుదీర్ఘంగా వివరించారు. హీమాంశు కుమార్ మనసమాజానికి కుల వర్గ మత తెగ స్వభావాలున్నాయని విశ్లేషించారు. వాళ్ళిద్దరి ప్రసంగ సారాన్ని అభావం చేయడం కోసం భారత్ బచావో అవగాహన పత్రం చాలా కష్టపడింది.
అంతేగాక మైనారిటీల్లో బోలెడు హిందూత్వ వుందని
నిరూపించడానికి నిర్వాహకులు గట్టి కసరత్తు చేశారు. “గుజరాత్ అల్లర్ల సందర్భంగా భారత రాష్ట్రపతి ఎవరూ?
ఏపిజే కలాం కాదా? ఆయన ముస్లిం కాదా?” అని సాక్షాత్తు భారత్ బచావో వ్యవస్థాపకులు ముస్లిం
ప్రతినిధుల్ని సభలో నిలదీశారు. గోడీ మీడియా, వాట్సప్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లను మించిన
పరిజ్ఞానాన్ని వారు ఎంతో గొప్పగా ప్రదర్శించారు. కేసు గెలవడానికి ఎంతకైనా తెగించే రామ్
జెఠ్ మలానీ వంటి వివాదాస్పద అడ్వకేట్ కూడ ఈ
స్థాయి అబధ్ధాలను చెప్పి వుండరు. ఇంతటి నైపుణ్యాన్ని సాధించినందుకు భారత్ బచావో అడ్మిన్
లకు అభినందనలు.
సత్యాన్వేషన మార్గాల గురించి కొందరు ప్రవచనకారులు భారత్ బచావో వాట్సప్ గ్రూపులో తరచూ
ఉపదేశాలు చేస్తుంటారు. ఆ సత్యాన్వేషణ మార్గాల్ని ఢిల్లీ జాతీయ వేదిక మీద వాళ్ళు డిజిటల్
డిస్ ప్లే చేసి చూపించారు.
ఫాసిజానికి ప్రధాన బాధితులు మత అల్పసంఖ్యాకవర్గాలనే
ప్రాధమిక వాస్తవాన్ని అవగాహనా పత్రం గుర్తించ నిరాకరించింది. కార్పొరేట్ సాంస్కృతిక
జాతీయవాద నియంతృత్వం మీద తాను పోరాడడం లేదంటూ భారత్ బచావో సంస్థ ముందుగానే అస్త్రసన్యాసం చేసింది. భారత్ బచావో అవగాహనా పత్రంవల్ల ముస్లిం. క్రైస్తవ,
శిక్కు మత అల్ప సంఖ్యాక వర్గాలకు ఏమాత్రం ఉపయోగంలేదు.
‘మేము 80 శాతం వాళ్లు 20 శాతం’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచుగా ప్రకటిస్తుంటారు. తాము సహితం ముస్లింలకు
దూరం అని భారత్ బచావో జాతీయ సదస్సు చెప్పకనే చెప్పింది. ముస్లింలను దరిచేర్చుకుని అమిత్ షా ఆగ్రహానికి గురికావడంకన్నా
ముస్లింలను దూరంగా పెట్టి అమిత్ షా అనుగ్రహానికి పాత్రులు కావడం గొప్ప తెలివైన ఆలోచనే.
భారత్ బచావో జాతీయ సదస్సు ఆహ్వాన కమిటీలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా, లిబరేషన్.
క్లాస్ స్ట్రగుల, న్యూ డెమోక్రసీ, రెడ్ స్టార్, రివల్యూషనరీ ఇనీషియేటివ్ ల పేర్లు ముద్రించారు.
అమిత్ షా దూరంగా పెట్టాలనుకున్న 20 శాతాన్ని
ఈ ఎంఎల్ పార్టీలు కూడ దూరంగా పెట్టాలనుకుంటున్నాయా? తేల్చుకోవాల్సిన అంశమే.
భారత దేశాన్ని కుల మత తెగ లింగ ప్రాంత భాషా
వర్గ సమాజంగా గుర్తించనివాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి మార్పులూ తేలేరు. ఏనుగును గుర్తించని
నలుగురు గుడ్డివాళ్ళుగా మిగిలిపోతారు. వారు దివ్యాంగులు కనుక కొంచెం జాలిపడుదాం.
భారత ఫాసిజానికి ప్రధానంగా బలి అయ్యేది
ముస్లింలు, ఆదివాసులు అనేది *ముస్లిం ఆలోచనాపరుల
వేదిక (MTF)* అవగాహన. భారత్ బచావో అవగాహన పత్రంతో
ఆదివాసులకు ఏ మేరకు మేలు జరుగుతుందీ ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఈ అవగాహన పత్రంతో కొనసాగే
భారత్ బచావో ఉద్యమంవల్ల హిందూ సమాజంలోని అణగారిన కులాలకు ఏ మాత్రం మేలు జరిగినా అది గొప్ప విషయమే. అలాంటి అణగారిన
కులాల శ్రేయస్సు కొరకు భారత్ బచావోకు *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)* సంఘీభావాన్ని
తెలుపుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం ప్రాతిపదికగా ఆయా సందర్భాల్లో తప్పక కలిసిపనిచేస్తుంది.
ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*
No comments:
Post a Comment