‘హిజాబ్’ న్యాయం
Mar 16 2022 @ 00:25AMహోంఎడిటోరియల్సంపాదకీయం
కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న హిజాబ్ ధారణ వివాదంలో ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ప్రకటించిన తుది తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ ధరించడం తప్పనిసరి మతచారాల్లోనికి రాదని నిర్థారించడంతో పాటు, విద్యాసంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ వస్త్రధారణపై విధించిన నిషేధాన్ని సైతం కోర్టు సమర్థించింది. ఆయా విద్యాసంస్థలు నిర్దేశించే నియమావళికి అక్కడి విద్యార్థులంతా కట్టుబడవలసిందేనని న్యాయస్థానం స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టును తేల్చనివ్వండి అని గతంలో వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం తాను ఏం చెప్పబోతున్నదో చూడాలి.
రాష్ట్ర హైకోర్టులో ఒక న్యాయమూర్తితో ఆరంభమై, త్రిసభ్యధర్మాసనానికి విస్తరించి, పదకొండురోజులు వాదోపవాదాలు సాగి, ఇరవైరోజుల క్రితం తీర్పును రిజర్వుచేసిన న్యాయస్థానం ఇప్పుడు దానిని ప్రకటించింది. అది తమ ఆశలను వమ్ముచేయనందున, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇకనైనా బుద్ధిగా చదువుకోండి అని పిటిషనర్లకు హితవు చెబుతున్నారు. ఈ తీర్పు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, మతస్వేచ్ఛను కాదనేట్టుగా ఉందని, ఏ వివక్షలూ లేకుండా విద్యను అభ్యసించగలిగే అవకాశాన్ని కొందరికి దూరం చేసేట్టుగా ఉందని మరికొందరు అంటున్నారు. ఇక, హిజాబ్ మతప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం, విద్యాసంస్థల యూనిఫామ్ నియమానికి విద్యార్థులు కట్టుబడాల్సిందేనని చెప్పడం, విద్యాసంస్థలకు మద్దతుగా కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎత్తిపట్టడం ద్వారా హైకోర్టు ప్రధానంగా ఈ తరహా ఉమ్మడి స్థలాల్లో అక్కడి నియామాలకు ఎవరైనా కట్టుబడి వ్యవహరించాల్సిందేనని నిర్దేశించినట్టు భావించాలి.
హిజాబ్ మతప్రాధాన్యం మీద ఒక ధర్మాసనం విస్తృతంగా లోతుగా వ్యాఖ్యానించడం బహుశా ఇదే ప్రధమం కావచ్చు. అది ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఎంతో ముఖ్యమైనదీ, ప్రాథమికమైనదీ అన్న వాదనపైనే పిటిషనర్లు ఈ కేసులో ప్రధానంగా ఆధారపడ్డారు. తరగతిగదిలో దానిని కొద్దిగంటలు పక్కనబెట్టవలసి వచ్చినా తమ మతవిశ్వాసాలకు విఘాతం కలుగుతుందనీ, అలాగే, రాజ్యాంగం 19, 25 అధికరణల ద్వారా తమకు దఖలుపరచిన హక్కులను దక్కనీయకుండా చేయడం అవుతుందని వారి వాదన. హిజాబ్ వినియోగం మౌలికమని ఇస్లామిక్ మత గ్రంధాలు చెప్పలేదనీ, అది కాలానుగుణంగా ఒక సంప్రదాయంగా వచ్చిచేరిందనీ, ఈ పిల్లలమాటలను విని న్యాయస్థానం దానికి మత ప్రాధాన్యం ఉన్నదని గానీ అంటే, ఇకపై ప్రతీ ముస్లిం మహిళా దానిని విధిగా పాటించవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. మొత్తం వివాదాన్ని నాలుగు ప్రధాన అంశాలుగా పరిష్కరించిన న్యాయస్థానం, ఈ వ్యవహారంలో పిటిషనర్లు చెప్పినవారిపై చర్యలుతీసుకొనేందుకు కానీ, దర్యాప్తులు జరిపించేందుకు కానీ అంగీకరించలేదు. పైగా, విద్యాసంవత్సరం మధ్యలో ఈ వివాదం ఎలా పుట్టుకువచ్చిందని అనుమానపడటం, అసాంఘికశక్తుల ప్రమేయం ఉన్నదేమోనని వ్యాఖ్యానించడం విశేషం.
రాజ్యాంగం దఖలు పరచిన హక్కుల వెలుగులో, తరగతి గదిలో హిజాబ్ ధరించడం మతపరంగా కీలకమైనదేనా? అన్న అంశాన్ని పరిశీలించదలచిన న్యాయస్థానం తన మధ్యంతర ఉత్తర్వుల్లో సైతం తుదితీర్పు వెలువడేవరకూ ఎవరూ తమతమ మత చిహ్నాలు ప్రదర్శిస్తూ విద్యాప్రాంగణాల్లోకి ప్రవేశించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి ఉపకరించినప్పటికీ, కొందరు న్యాయనిపుణులు దీనిని సమర్థించలేదు. వాదనలు వినకుండానే న్యాయమూర్తులు తీర్పు చెప్పేశారని అన్నారు. ఇక, హిజాబ్ మత ప్రాధాన్యం విషయంలో పిటిషనర్ల వాదనను కాదన్నప్పటికీ, వారి ప్రాధమికహక్కులను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం తీర్పు వెలువడవచ్చునని కొందరు వేసిన అంచనాలు కూడా ఇప్పుడు తప్పాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో, రేపు ఇతర మతాలవారూ తమ ఆహార్యం విషయంలో పరిమితులు ఎదుర్కోవలసి రావచ్చు. ‘ప్రోటోకాల్’ విషయంలో విద్యాసంస్థల హక్కును సమర్థించడం బాగున్నది కానీ, యూనిఫామ్ సహా పలు నడవడికల విషయంలో ఇప్పటివరకూ ఏ ఆంక్షలూ నియమాలూ లేని సంస్థలు రేపు నయానో భయానో వాటిని రుద్దవలసి రావచ్చు. ఉమ్మడిగా, అన్ని మతాలవారితో కలసి చదువుకోవాల్సిన వారు విధిలేక మతవిద్యాసంస్థల్లో చేరవలసిన అగత్యం ఏర్పడవచ్చు. కీలకమైన, సున్నితమైన ఈ అంశాన్ని దేశ సర్వోన్నతన్యాయస్థానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment