కర్ఫ్యూ వాయిదా
Jan 12 2022 @ 02:20AMహోంఆంధ్రప్రదే
పండగ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
తొలుత మంగళవారం నుంచే అని ఉత్తర్వులు
ఆ తర్వాత జీవోలో మార్పు చేస్తూ నిర్ణయం
18 నుంచి 31 వరకూ కర్ఫ్యూ అమలు
రాష్ట్రంలో యాక్టివ్ కేసులు పైపైకి
కొత్తగా 1,831 మందికి పాజిటివ్
బూస్టర్ డోస్ వేసుకోవాలని సర్కారు వినతి
అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామన్న ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గింది. 24 గంటల వ్యవధిలోనే కర్ఫ్యూ నిబంధనల జీవోను రెండుసార్లు మార్చింది. తొలుత మంగళవారం నుంచే కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మంగళవారం ఉదయం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. సాయంత్రానికి నిర్ణయం మార్చుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి తర్వాత 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తాజాగా పేర్కొంది.
కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆస్పత్రులు, వైద్య పరీక్షా కేంద్రాలు, మందుల షాపులు, మీడియా ప్రతినిధులకు మినహాయింపు కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు, ఇతర కోర్టులు, స్థానిక సంస్థల ఉద్యోగులతో పాటు ఎమర్జెన్సీ సేవలందించే ఉద్యోగులకు డ్యూటీ పాస్ కచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు యధావిధిగానే జరుగుతాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలకు 200 మందికి, ఇండోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతిస్తారు. షాపులు, వ్యాపార సముదాయాల్లో ఈ నిబంధనలు పాటించకపోతే షాపుల యాజమాన్యానికి రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వాళ్లు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని ఆరోగ్యశాఖ కమిషనర్ కె.భాస్కర్ తెలిపారు.
కొత్తగా 1,831 మందికి పాజిటివ్‌రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం రాష్ట్రంలో 984 కరోనా కేసు లు నమోదు కాగా.. ఒక్కరోజులోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైంది. దీంతో యాక్టివ్ కేసులు 7,195కు పెరిగిపోయాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,452 పరీక్షలు చేయగా 18,31 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
No comments:
Post a Comment