Sep 6 2021 @ 02:18AM
- తాలిబాన్ - హక్కానీ నెట్‌వర్క్ మధ్య కోల్డ్‌వార్
- మార్పు దిశగా తాలిబాన్ల అడుగులు
- కరడుగట్టిన ఇస్లాం రాజ్యమే హక్కానీ డిమాండ్
- భావి అధ్యక్షుడు బరాదర్‌కు గాయాలు
- సివిల్‌వార్ అవకాశాలపై అమెరికా హెచ్చరికలు
- పంజ్‌షీర్‌కు చేరుకుంటున్న వేలాది అఫ్ఘాన్లు
- 700 మంది తాలిబాన్లను హతమార్చాం
- మరో వెయ్యి మందిని నిర్బంధించాం: సలేహ్
- శత్రువుకు లొంగడం కంటే.. మరణమే శరణ్యం
- అదే జరిగితే.. నా తలలో 2 తూటాలు పేల్చండి
- అంగరక్షకులకు అమ్రుల్లా సలేహ్ ఆదేశాలు
- సెక్స్ వర్కర్ల జాబితా సిద్ధం చేస్తున్న తాలిబాన్లు
- వారికి సామూహికంగా ఉరి శిక్షలు వేసేందుకే!
కాబూల్/న్యూఢిల్లీ/వాషింగ్టన్, సెప్టెంబరు 5: యుద్ధ కల్లోలిత దేశం అఫ్ఘానిస్థాన్ ఇప్పుడు అంతర్యుద్ధం దిశగా అడుగులు వేస్తోందా? తాలిబాన్లు తమ దేశం పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్‌గా నామకరణం చేసినా.. గ్రూపు తగాదాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారా? తాలిబాన్లలో భాగమైన హక్కానీ నెట్‌వర్క్ అందుకు ప్రధాన కారణమా? హక్కానీ నెట్‌వర్క్‌ను పెంచిపోషించిన పాక్ నిఘా సంస్థ ఐఎ్‌సఐ అందుకే ఉన్నఫళంగా కాబూల్‌కు చేరుకుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. నిజానికి తాలిబాన్లు శుక్రవారం ప్రార్థనల తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం లీడర్‌గా.. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. హక్కానీ నెట్‌వర్క్ నేతలు అందుకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ప్రభుత్వ ప్రకటనను తొలుత శనివారానికి.. ఆ తర్వాత ఒక వారం పాటు వాయిదా వేశారు. కాగా.. శనివారం ప్రభుత్వ ఏర్పాట్లలో భాగంగా తాలిబాన్లకు, హక్కానీ నెట్‌వర్క్ నేతలకు మధ్య జరిగిన చర్చలు ఘర్షణలకు దారితీశాయని.. దాడులు, ప్రతిదాడుల్లో బరాదర్ తీవ్రంగా గాయపడ్డారని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. తాలిబాన్ల రెబెల్స్‌కు నాయకుడు, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాలిబాన్ల అధికార ప్రతినిధి మహమ్మద్ నయీం దీన్ని పరోక్షంగా ఖండిస్తూ ‘‘ఐక్యరాజ్య సమితి ప్రతినిధి మార్టిన్ గ్రిఫిత్స్ ఆదివారం బరాదర్‌తో భేటీ అయ్యారు. తమ సాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు’’ అని ట్వీట్ చేశారు. ఓవైపు పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, రెబెల్స్‌కు మధ్య భీకర పోరు.. మరోవైపు తాలిబాన్ల మధ్య గ్రూపు తగాదాలతో అఫ్ఘాన్ ఇప్పుడు అంతర్యుద్ధం దిశగా పయనిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా సైనిక దళాల జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ విల్ కూడా ఇదే విషయాన్ని అంచనావేశారు. ‘‘అల్-ఖాయిదా, ఐఎ్‌స-కే వంటి ఉగ్రమూకలు మళ్లీ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ రోజురోజుకూ భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి’’ అని ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
రక్షణ శాఖ కోసం పేచీ!
కొత్తగా ఏర్పడనున్న తాలిబాన్ల ప్రభుత్వంలో రక్షణ శాఖతో పాటు పలు కీలక శాఖల కోసం హక్కానీ నెట్‌వర్క్ పట్టుబడుతోందని అఫ్ఘాన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అనధికారిక వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఖతార్ వేదికగా ఇప్పటికే భారత్ సహా.. పలు దేశాలతో చర్చలు జరిపిన షేక్ మహమ్మద్ అబ్బాస్ స్థానెక్జాయ్‌ని విదేశాంగ మంత్రిగా, తాలిబాన్లలో బాంబుల నిపుణుడిగా పేరున్న సదర్ ఇబ్రహీంను హోం మంత్రిగా, ముల్లా ఒమర్ తనయుడు ముల్లా మహమ్మద్ యాకూబ్‌కు కీలక శాఖ లేదా ప్రధాని పదవిని, తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ను సమాచార మంత్రిగా నియమిస్తారని తెలిసింది. అయితే.. అఫ్ఘాన్‌ను చేజిక్కించుకోవడంలో తాలిబాన్లతో కలిసి పనిచేసిన హక్కానీ నెట్‌వర్క్ కూడా మంత్రివర్గంలో కీలక పదవులను ఆశిస్తోంది. ఈ వర్గంలో అమెరికాకు మోస్ట్‌వాంటెడ్ అయిన ఖలీల్ హక్కానీ, అతని సోదరుడి కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ, మరోనేత అనాస్ హక్కానీ ఉన్నారు. అధ్యక్ష పీఠాన్ని తమకే ఇవ్వాలని వీరు పట్టుబడుతున్నారని తెలిసింది.
తాలిబాన్ల ప్రకటనలకు విరుద్ధంగా..
తాలిబాన్లు తాము మారామని నిరూపించుకోవడానికి శాంతిమంత్రం జపిస్తుంటే.. హక్కానీ నెట్‌వర్క్ అందుకు వ్యతిరేకంగా పనిచేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము మహిళా హక్కులను గౌరవిస్తామని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ప్రకటించిన రోజే.. వంట సరిగ్గా చేయలేదనే కారణంతో కొందరు తాలిబాన్లు ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి, సజీవదహనం చేశారు. తాజాగా ఆదివారం ఘోర్ ప్రావిన్సులోని ఫిరోజ్కో నగరంలో నిగారా అనే ఓ మహిళా పోలీసు అధికారిని ఆమె పిల్లల ముందే తాలిబాన్లు కాల్చి చంపారు. ఆ తర్వాత ఆమె తలను ఛిద్రం చేశారు. గిరిజనులు, మహిళలు సహా.. అన్నివర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పిస్తామని తాలిబాన్లు ప్రకటించడాన్ని హక్కానీ నెట్‌వర్క్ తీవ్రంగా విభేదించినట్లు తెలిసింది. ఇస్లామిక్ రాజ్యంగా అఫ్ఘాన్ ఉండాలని, షరియత్ చట్టాలను గౌరవించే కరడుగట్టిన ఇస్లామిక్ వాదులకే ప్రభుత్వంలో స్థానం ఉండాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో అల్-ఖాయిదా, ఇతర ఉగ్ర సంస్థల నేతలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెబుతూ.. వారిని కాబూల్‌కు ఆహ్వానించింది. మరోవైపు బరాదర్‌కు పాక్ ప్రమేయంపై ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల దృష్ట్యా తాను పెంచి పోషించిన హక్కానీ నెట్‌వర్క్ కోసం పాకిస్థాన్ ఐఎ్‌సఐ చీఫ్ ఫయాజ్ హమీద్ శనివారం ఉన్నఫళంగా కాబూల్ చేరినట్లు తెలుస్తోంది. కాగా సెక్స్ వర్కర్లను గుర్తించి, షరియత్ చట్టాల ప్రకారం వారికి సామూహికంగా ఉరి శిక్షలు విధించాలని తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని అఫ్ఘాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందుకోసం వారు పోర్న్ సైట్లను, డేటింగ్ సైట్లను జల్లెడ పడుతున్నారని, వాటిల్లో లభించే వివరాల మేరకు సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారని ఆ కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికలు నిర్వహించాలి
తాలిబాన్ల చేతిలో అఫ్ఘాన్ ప్రజల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీలైనంత త్వరగా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.
- ఇరాన్ అధినేత ఇబ్రహీం రైసీ
మహిళల గురించే ఆందోళన
అఫ్ఘాన్‌లో మహిళలు, బాలికల భవిష్యత్ గురించి ఆందోళన నెలకొంటోంది. త్వరలో ఏర్పాటు కానున్న ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తుందనే భయాందోళనలు ఉన్నాయి.
- ఏంజెలీనా జూలీ, హాలీవుడ్ నటి
చిత్ర పరిశ్రమకు గడ్డుకాలమే!
తాలిబాన్ల ఆక్రమణకు ముందు అఫ్ఘాన్ చిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో సినిమాలు నిర్మాణ దశలో, షూటింగ్ ముగిసిన, పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వాటి విడుదలకు ముందే.. తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
- అఫ్ఘాన్ మహిళా నిర్మాత సహ్రా కరీమీ
శరణార్థులను ఆదుకోండి
ప్రపంచ దేశాలు అఫ్ఘాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలి. వారిని ఆదుకోవాలి.
- పోప్ ఫ్రాన్సీస్
ఇరాన్ సహకారం తప్పనిసరి
అఫ్ఘానిస్థాన్‌కు ఇరాన్ సహకారం తప్పనిసరి. ఇప్పటికే మేము (చైనా), రష్యా, పాకిస్థాన్‌లు అఫ్ఘాన్‌లోని తాలిబాన్లకు సహకరిస్తున్నాం.
- వాంగ్ యీ, చైనా విదేశాంగ ప్రతినిధి
వేచి చూడడమే పరిష్కారం
అఫ్ఘాన్ పరిణామాల విషయంలో భారత్ ముందున్నది వేచి చూడాల్సిన ధోరణి మాత్రమే. ఎందుకంటే అఫ్ఘాన్ పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని పాకిస్థాన్, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఐఎ్‌సఐ చీఫ్ కాబూల్‌కు వెళ్లడం వెనకా మతలబును అర్థం చేసుకోవచ్చు.
- భారత విదేశాంగ మాజీ ప్రతి నిధులు అనిల్, రాఘవన్, రాకేశ్‌సూద్
నెల దాటితే.. పంజ్‌షీర్ చిక్కదు!
అఫ్ఘాన్ మొత్తాన్ని ఆక్రమించినా.. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో పాగా వేయకపోవడం పట్ల తాలిబాన్లు రగిలిపోతున్నారు. ముఖ్యంగా హక్కానీ నెట్‌వర్క్ పంజ్‌షీర్ రెబెల్స్‌పై యుద్ధంలో యాక్టివ్‌గా ఉంది. శనివారం కాబూల్ చేరిన ఐఎ్‌సఐ చీఫ్ వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమతో పోరాడుతున్న 700 మంది తాలిబాన్లను తుదముట్టించామని, మరో వెయ్యి మందిని నిర్బంధించామని పంజ్‌షీర్ రెబెల్స్ నేత మసూద్, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ప్రకటించారు. బరాదర్ కూడా శాంతిని కోరుకుంటున్నారని, తాలిబాన్లను వెనక్కి రావాల్సిందిగా శనివారం ఆదేశాలిచ్చారని సలేహ్ గుర్తుచేశారు. కానీ, ఐఎ్‌సఐ ప్రేరేపిత పోరు కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘తాలిబాన్ల అరాచకాలను ఊహించిన 10 వేల మంది అఫ్ఘాన్లు పంజ్‌షీర్ చేరుకున్నారు. ఇక్కడ శరణార్థులుగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు తాలిబాన్లకు ఈ నెలాఖరులోగా పంజ్‌షీర్‌ను కైవసం చేసుకోవడం అత్యంత అవసరం. అక్టోబరు నుంచి అఫ్ఘాన్‌లో చలికాలం ప్రారంభమవుతుంది. పర్వత ప్రాంతమైన పంజ్‌షీర్‌లో మంచు, చలికి తాలిబాన్ సేనలు తట్టుకోలేవు. ఆలోగా పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకోలేకపోతే.. మరో ఐదు నెలల విరామం అనివార్యం. అదే జరిగితే.. రెబెల్స్ బలాన్ని పుంజుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే పంజ్‌షీర్‌కు దారితీసే మార్గాల్లో ల్యాండ్‌మైన్స్ పెట్టి తాలిబాన్లను ముప్పుతిప్పలు పెడుతున్న రెబెల్స్‌కు మరింత పదునైన వ్యూహాలకు అవకాశం దొరుకుతుంది. మరోవైపు.. తాలిబాన్లు పంజ్‌షీర్‌ను ఆక్రమించే పరిస్థితే వస్తే.. తన తలలో తుపాకీతో రెండు సార్లు కాల్చాలని అమ్రుల్లా సలేహ్ తన అంగరక్షకులకు చెప్పినట్లు తెలిసింది. తాను గాయపడ్డా చంపేయాలని, తాలిబాన్లకు లొంగిపోవడం కంటే మరణమే శరణ్యమని ఆయన పేర్కొన్నట్లు డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది.
No comments:
Post a Comment