Sunday, 13 September 2020

ముస్లిం చైతన్య ఎజెండా - 7 పాయింట్ ఫార్ములా - ముస్లిం సోషల్ మూవ్మెంట్

ముస్లిం చైతన్య ఎజెండా  - 7 పాయింట్ ఫార్ములా


September 1, 2020


 

నేడు ముస్లింలు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితుల దృష్ట్యా వారి ప్రగతికి కొన్ని నిర్ణయాలతో సెవెన్ పాయింట్ ఫార్ములాను ప్రకటిస్తున్నాము. ముస్లిం చైతన్య ఎజెండాగా ప్రకటిస్తున్న ఈ ఏడు అంశాలను ఆచరించడం ద్వారా ముస్లిం సామాజిక ఉద్యమం నిర్మించడమే ముస్లింలకు మేలు చేస్తుందని బలంగా విశ్వసిస్తున్నాం.

 

1.   1. ముస్లింలు ఈ దేశ మూలవాసులు

 

ముస్లింలు ఈ దేశ మూలవాసులనే స్పృహను అందరం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని ముస్లింలలోకి, ముస్లిమేతరులలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. 90 శాతం ముస్లింలు ఎస్సీ బీసీ ఎస్టీల నుంచే ఇస్లాం స్వీకరించారనే వాస్తవాన్ని జీర్ణం చేసుకోవాలి. ఆంత్రోపాలజీ, DNA పరీక్షల ప్రకారం నిర్ధారించబడుతున్న ఈ విషయాన్ని గ్రహించి ప్రచారం చేయాలి.

 

2. భారత రాజ్యాంగం, జాతీయ పతాకం చేతబూని పురోగమించాలి.

 

మనది ప్రజాస్వామిక వ్యవస్థ, ఈ వ్యవస్థ వల్లే మైనారిటీలకు హక్కులుంటాయని గుర్తించాలి. రాజ్యాంగ, ప్రజాస్వామ్య చట్టాలపై గౌరవంతో రాజ్యాంగ పరిరక్షణకై, రాజ్యాంగ హక్కులకై నిలబడాలి. పోరాడాలి.

 

1.   3. ఏడుగురు సామాజిక మార్గదర్శులు

 

ఫాతిమా_షేక్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్,  అజ్ఘర్ అలీ ఇంజినీర్,  (సయ్యద్) ఆమీర్ అలీ, డా. బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే లను సామాజిక మార్గదర్శులుగా స్వీకరించి పురోగమించాలి. వారు ముస్లింలకు అందించిన జ్ఞాన మార్గంలో పయనించాలి.

 

2.   4 దునియాదారికి ప్రాముఖ్యత ఇవ్వాలి.

 

దీన్ కే సాత్ దునియా కో లేకే చలేంగే!

 

ఆధునికతను అందిపుచ్చుకోవాలి. ఆధునిక ఆలోచనల అభివృద్ధికి పాటుపడాలి. మనలోని అప్రజాస్వామిక_ధోరణులు వేటినైనా సంస్కరించుకోవాలి.

 

భారతీయ ముస్లింలు భారత సమాజంలో భాగం. ఈ విషయాన్ని గర్వంగా చాటుకోవాలి. అందులోని ప్రత్యేకతలను గుర్తించాలి. తాము వేరే, తాము చాలా ప్రత్యేకం అనే నెగెటివ్ పోకడలు సరైనవి కావు. నేల విడిచి సాము చేయడం లాంటి అలాంటి విషయాల పట్ల స్పృహతో వ్యవహరించాలి. సమూహంగా సంఘటితమవుతూ ప్రజాస్వామిక, అస్తిత్వ ఉద్యమాలు నిర్వహించడం, భావసారూపమున్న ఉద్యమాలతో కలిసి నడవడం తప్పనిసరి.

 

మతం వ్యక్తిగతం అనే స్పృహ కలిగి ఉండాలి. ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవాలి.

 

ముస్లింలంతా సమానం అని ఇస్లాం చెబుతుంది. కానీ ముస్లింలలోనే కొన్ని ఉపజాతుల పట్ల చిన్నచూపును తొలగించుకోవాలి. భాష, సంస్కృతులు, ఆచారాల రీత్యా ఈ చిన్నచూపు సరైంది కాదు. అందరమూ సమానమన్న భావనను పెంపొందించుకోవాలి. మిగతా సమాజంతో, ముఖ్యంగా బహుజనులతో ఐకమత్యంగా మెలగాలి. అందుకు పెద్ద ఎత్తున పాటుపడాలి.

 

5. ప్రాపంచిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.

 

ఇంగ్లీషు మీడియం చదువు ఫస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో సర్ సయ్యద్ మనకు ఐకాన్. ముస్లింలు ఐదు భాషల మధ్య చీలిపోతున్నారు. ఉర్దూ, అరబ్బీ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు (తదితర ప్రాంతీయ భాష). అది కూడా గందరగోళానికి గురిచేస్తున్నది. ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బ తీస్తున్నది.

 

ఇంగ్లీషుకు ప్రాధాన్యం ఇస్తూ సెకండ్ లాంగ్వేజ్ మనకు ఇష్టమయ్యింది తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ప్రాంతీయ భాష రాకపోవడం ఇబ్బందేనన్న విషయం గ్రహింపులో ఉండాలి.

 

అలాగే ముస్లింలు ప్రాపంచిక, సామాజిక విషయాల అధ్యయనం విస్తృతంగా కొనసాగించాలి.

 

6. ముస్లిం పురుషులతో సమానంగా స్త్రీలను చూడాలి.

 

ముస్లిం అమ్మాయిలకు అబ్బాయిలతో సమానంగా ఇంగ్లీషు మీడియం విద్య చెప్పించాలి. ఈ విషయంలో ఫాతిమా షేక్ మన ఐకాన్ స్వీకరించాలి.

 

మన ముస్లిం జనాభాలో సగభాగమైన ముస్లిం స్త్రీలు చదువులో, ఇతర రంగాలలో పురోగమించాలి. స్త్రీలలో అక్షరాస్యత అతి తక్కువగా ఉంది. అబ్బాయిలను ఇంగ్లీషు మీడియం చదివిస్తూ అమ్మాయిలను ఉర్దూ మీడియం, అరబ్బీ చదివించడం కూడా జరుగుతున్నది. స్త్రీలు వెనుకబడి ఉండడమన్నది మొత్తంగా ముస్లిం సమాజ పురోభివృద్ధికి పెద్ద అడ్డంకిగా ఉన్నదన్న విషయం గమనంలోకి తీసుకోవాలి.

 

7. ముస్లింలు ప్రత్యేక ఐడెంటిటీని నిలబెట్టుకుంటూనే బహుజన  ఐడియాలజీతో ముందుకుసాగాలి.

 

బహుజన రాజకీయాలతో, ఇతర లైక్ మైండెడ్ ఉద్యమాలతో కలిసి నడవాలి. భవిష్యత్తు బహుజన ఉద్యమాలదే అన్న స్పృహలోంచి ముందుకు నడవాలి. రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో పాల్గొనాలి.

 

ముస్లిం రిజర్వేషన్ ను, అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేయాలి.

 

యూసుఫ్ షేక్ (స్కైబాబ)

 

కన్వీనర్

ముస్లిం సోషల్ మూవ్మెంట్

 

డా.షాజహానా,

ఎస్ ఎం డి ఇనయతుల్లా

నబి కరీమ్ ఖాన్

వహీద్ మహమ్మద్

సయ్యద్ ఖుర్షీద్

షేక్ పీర్ల మహమూద్

తదితర ముస్లిం విద్యావంతులు, రచయితలు


Danny

కష్టాల్లో వున్నవాళ్ళు బాధితులుగా ఒకచోట చేరుతారు. ఐక్యత అంత వరకే.  విభిన్న బాధిత సమూహాల సమస్యలు, ఆకాంక్షలు ఒకటికావు. 


No comments:

Post a Comment