Wednesday 6 December 2017

బాబ్రీ విధ్వంసం : వాస్తవాలు - ఇర్ఫాన్‌ హబీబ్‌

బాబ్రీ విధ్వంసం : వాస్తవాలు - ఇర్ఫాన్‌ హబీబ్‌
Posted On: Tuesday,December 5,2017

- బాబ్రీ మసీదు కూల్చివేతకు పాతికేళ్లు


బాబ్రీ మసీదు స్వాధీనంలో వున్న భూమి, దాని ఆవరణంపై వున్న తగాదా వాస్తవంగా ఆస్తి తగాదా. 1949 డిసెంబర్‌ 22, 23న హింసాత్మకంగా జొరబడడానికి ముందు...12 సంవత్సరాల పాటు ఆ భూమి ఎవరి స్వాధీనంలో వుందనేది ముఖ్యమైన విషయం.
వాల్మీకి రామాయణంలోను, అదేవిధంగా నేడు అయోధ్యగా పిలవబడుతున్న పట్టణం బ్రిటిష్‌ కాలానికి ముందు అవధ్‌గా అందరికీ తెలుసు. 'రామచరిత మానస్‌'లో తులసీదాస్‌ దీనిని అవథ్‌-పూరీగా పేర్కొన్నాడు. ఇది ఒక పెద్ద నగరం. 'అవథ్‌' అనే విశాల ప్రాంతానికి రాజధాని. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. 1526లో భారతదేశంలో బాబరు మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించినపుడు అవథ్‌ (అయోధ్య) ఆయన చేతుల్లోకి పోయింది. అతని గవర్నర్‌ మీర్‌ బాఖి అక్కడ ఒక పెద్ద మసీదును నిర్మించాడు. అదే బాబ్రీ మసీదుగా ప్రసిద్ధికెక్కింది. దీని నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలను పర్షియన్‌ భాషలో రెండు శాసనాలుగా లిఖించారు. ఒకటి మసీదు పీఠంపైన, ఇంకొకటి గేటుపైన వున్నాయి. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో కూల్చివేయబడిన దేవాలయం స్థానంలో ఈ మసీదును నిర్మించినట్లుగా వీటిలో ఎక్కడా లేదు. వాస్తవానికి అదే జరిగి వుంటే మీర్‌ బాఖి ఖచ్చితంగా ప్రకటన చేసి వుండేవాడు.
వాస్తవానికి రాముడు జన్మించిన స్థలంగా అయోధ్యకు పేరు, ప్రఖ్యాతులు బాబ్రీ మసీదు నిర్మాణం తరువాతనే వచ్చాయి. 1వ శతాబ్దం బిసి నుండి 12వ శతాబ్దం ఎడి వరకు, అయోధ్యలో లిఖించబడిన సంస్కృత శాసనాలకు, రాముడికి ఏ సంబంధం లేదు. ఆ శాసనాలలో రాముడి పేరు కూడా లేదు. కానీ విష్ణు, శివుడు, వాసుదేవుడు (కృష్ణుడు) పేర్లు వున్నాయి. అయోధ్య ప్రాంతంలో రామజన్మ భూమి గురించి మొట్టమొదటిసారిగా సంస్కృత భాషలో పొందుపరచింది స్కంద పురాణంలోనే. దీనికి సంబంధించి కూడా భిన్నమైన కథనాలున్నాయి. కానీ ఇది 1600 ముందు మాత్రం కాదు. అయోధ్యలో 30కి పైగా వున్న పవిత్ర స్థలాలలో, ఒక స్థలాన్ని రామజన్మభూమిగా పేరు పెట్టారు. ఇది కూడా 18వ శతాబ్దంలో రెండవ సగ భాగం తరువాత మాత్రమే. బాబర్‌ లేదా ఔరంగజేబు ఒక మసీదు నిర్మించడానికి ఒక దేవాలయం కూల్చివేయబడిందన్న ఆరోపణ కూడా వుంది. ఈ రెండు శాసనాలను బాబర్‌ కాలంలో చేశారు కాబట్టి, బాబర్‌ మసీదును నిర్మించడమే కాదు (వాస్తవానికి అది మీర్‌ బాఖి నిర్మించినప్పటికీ) దేవాలయం కూల్చిన అనంతరం మాత్రమే ఆ పని చేశాడని చాలామంది ముస్లింలు కూడా విశ్వసించారు.
ఆ విధంగా 1855లో మత ఘర్షణలకు తావిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ స్థలం అప్పుడు అవథ్‌ నవాబు ఆధీనంలో వుంది. అతని అధికారులు ఈ సమస్యను, మసీదు బయట విగ్రహాలను పెట్టుకునేందుకు అనుమతించి పరిష్కరించారు. విగ్రహాలు ప్రతిష్టించిన ప్రాంతాన్ని 'సీత వంటిల్లు' అని పిలిచారు. మసీదుకు ఒక ట్రస్ట్‌ (వక్ఫ్‌) కూడా ఏర్పడింది. 1884లో ఈ కేసు ఫయిజాబాద్‌ సబ్‌జడ్జి పండిట్‌ హరికిషన్‌, ఆ తరువాత 1885లో అవధ్‌ జుడిషియల్‌ కమిషనర్‌ డబ్ల్యూ యంగ్‌ ముందుకు వచ్చింది. వీరిరువురూ మసీదు ముస్లింల ఆధీనంలో వుండాలని నిర్ణయించగా, డబ్ల్యూ యంగ్‌ మాత్రం 'సీత వంటిలు'్ల హిందువు లకే చెందాలన్న నిర్ణయం కూడ చేశాడు. ఈ సమస్య పరిష్కారం అయ్యేదే, కానీ 1930లలో మత ఉద్రిక్తతలు మళ్ళీ ఊపిరి పోసుకోవడం వలన, హిందూ మతానికి చెందిన ఒక గుంపు మసీదులోకి జొరబడి మసీదు పీఠాన్ని ధ్వంసం చేసి దానిపైనున్న పర్షియన్‌ శాసనాలను నాశనం చేసింది. కానీ మసీదును మళ్ళీ ముస్లింలు స్వాధీనపరచుకున్నారు. 1949 డిసెంబర్‌ వరకు వారు అక్కడే ప్రార్థనలు చేసుకున్నారు.
1948 జనవరి 30న, హిందూ మహాసభ, ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త నాథూరాం గాడ్సే... గాంధీజీని హత్య చేసినపుడు, ఆర్‌.ఎస్‌.ఎస్‌.పై నిషేధం విధించారు. కానీ దాని నాయకుడైన గోల్వాల్కర్‌ మోసపూరిత భరోసాల ఆధారంగా 1949 జూలైలో ఆ నిషేధం ఎత్తివేయబడింది. వెంటనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. హిందూ మహాసభలు మత విద్వేషాలను రగిలించడానికి అవసరమయ్యే సమస్య కోసం వెతకగా, బాబ్రీ మసీదు సమస్య వారికి దొరికింది. 1949 డిసెంబర్‌ 22, 23 రాత్రి సమయంలో మసీదు తాళాలు పగులగొట్టి సీత వంటింటి దగ్గర వున్న విగ్రహాలను మసీదు పీఠం దగ్గర వున్న ప్రధాన స్థానానికి మార్చివేశారు. దాని వలన ముస్లింలు నమాజ్‌ చేసుకోవడానికి, సమావేశం కావడానికి అవకాశం వుండదు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను పోలీసు నివేదిక ద్వారా తెలియపరచినప్పటికీ, విగ్రహాలు వాటంతట అవే మసీదులోకి రాలేదు, మనుషులే తీసుకొనివచ్చి పెట్టారన్న విషయం గుర్తించడానికి భారతీయ న్యాయ వ్యవస్థకు 61 సంవత్సరాల సమయం పట్టింది. నాటి ప్రధాని నెహ్రూ, హోంశాఖ మంత్రి సర్దార్‌ పటేల్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రి గోవింద వల్లభ్‌పంత్‌లు ఈ విషయం ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ, విగ్రహాలు వాటి స్థానాలలోకి తిరిగి చేరాలి, మసీదును ముస్లింలకు అప్పజెప్పాలన్న తీర్పుకు ఏ విధమైన మద్దతు లభించలేదు.
ఈ సమస్యను మూడు దశాబ్దాలపాటు అణచిపెట్టి వుంచారు. మసీదు లోపలే విగ్రహాలను వుంచి, హిందూ, ముస్లింలిరువురు లోపలికి వెళ్ళకుండా మసీదును మూసివేశారు. 1980 సాధారణ ఎన్నికలలో బిజెపిగా ఏర్పడిన జనసంఫ్‌ు ఓటమిపాలైంది. దాని నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేపట్టిన నినాదం 'గాంధేయ సోషలిజం' అంతగా ప్రభావం చూపలేదు. కాబట్టి తీవ్రమైన మతతత్వ వైఖరి ప్రధాన ఎజెండాలోకి చేరింది. 1984లో బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రామాలయం నిర్మిస్తామన్న నినాదంతో విశ్వహిందూ పరిషత్‌ స్థాపించబడింది. ఆ విధంగా 1986, ఫిబ్రవరి 1వ తేదీన ఈ సమస్యకు తిరిగి ఊపిరి పోశారు. మసీదులో హిందువులు విగ్రహాలకు పూజలు చేసుకోవడానికి అనుమతిస్తూ, ముస్లింలు మసీదులోకి వెళ్ళకూడదని అనుమతిని నిరాకరిస్తూ, నాటి జిల్లా జడ్జి కె.ఎం. పాండే మసీదును తెరవాలని ఒక ఆజ్ఞను జారీ చేశారు.
రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయడంతో బాబ్రీ మసీదు ఒక ఆలయంగా మార్చి వేయబడింది. ముస్లింలు వెలివేతకు గురయ్యారు. ఆ స్థలంలోకి ఇటుకలు తీసుకొచ్చి గుడికి పునాది రాయి వేయాలనే ఉద్దేశ్యంతో 1989, నవంబర్‌ 9న శిలాన్యాస్‌ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తరువాత సంవత్సరం అంటే 1990 సెప్టెంబర్‌ - అక్టోబర్‌ మాసాలలో అద్వానీ రథయాత్ర అనంతరం బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. బాబ్రీ మసీదుకు రక్షణ కల్పించాలని 1986 నుండి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), ఇతర ప్రజాతంత్ర లౌకిక శక్తులు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. కానీ ఎటువంటి చర్యలు లేవు. దాంతో మసీదును కూల్చడానికి మార్గం సుగమం అయింది.
1991లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బాబ్రీ మసీదును కూల్చే పథకానికి ఒక సమగ్ర రూపం వచ్చింది. బాబ్రీ మసీదును కూల్చడమే వారి ప్రధాన ఉద్దేశ్యం అని అద్వానీ, బిజెపి నాయకులు, వేలమంది కరసేవ కులు ప్రకటించినప్పటికీ, డిసెంబర్‌ 6, 1992న వారంతా అయోధ్య దగ్గర గుమిగూడడానికి అనుమతించారు. దీనిలో పోలీసుల జోక్యం లేదు. బాబ్రీ మసీదును కూల్చడానికి, విగ్రహాలను తొలగించి, తిరిగి వాటిని ప్రతిష్టించడానికి వారికి పూర్తిగా 24 గంటల సమయం ఇచ్చారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో ఏర్పడిన స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని చేస్తున్న ఉద్యమం తరువాత దశ ప్రారంభమైంది. బాబ్రీ మసీదు స్వాధీనంలో వున్న భూమి, దాని ఆవరణంపై వున్న తగాదా వాస్తవంగా ఆస్తి తగాదా. 1949 డిసెంబర్‌ 22, 23న హింసాత్మకంగా జొరబడడానికి ముందు...12 సంవత్సరాల పాటు ఆ భూమి ఎవరి స్వాధీనంలో వుందనేది ముఖ్యమైన విషయం. కానీ, అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఈ సమస్యపై తీర్పు చెప్పింది. తప్పుడు పద్ధతులలో చేసిన చరిత్ర, పురావస్తు శాస్త్రాల అధ్యయనం ఆధారంగా ఆ తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక ఫిర్యాదు పెండింగ్‌లో వున్నది. తన కడపటి తీర్పు ఒక విశ్వాసాన్ని కల్పించలేకపోయిందన్న విషయం కోర్టు గమనించాలి. కానీ, మనకు మాత్రం అంతిమంగా మధ్యవర్తులు భారత ప్రజలు మాత్రమే. బాబ్రీ మసీదు కూల్చివేసి 25 సంవత్సరాలు గడచిన సందర్భంలో బాబ్రీ మసీదు సమస్య విషయంలో లౌకికతత్వం పట్ల కామ్రేడ్‌ జ్యోతిబసుకు వున్న నిబద్ధతను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలి. భారత జాతి ప్రజాతంత్ర విలువలు మరియు గౌరవం గురించి ప్రతి ఒక్కరు తమ శక్తి కొద్దీ ప్రజలకు తెలియచేయాలి.

- ఇర్ఫాన్‌ హబీబ్‌

No comments:

Post a Comment