ఒక్కరికీ నిజం చెప్పే ధైర్యం లేదా?
Oct 2 2020
యూపీ ముఖ్యమంత్రి లక్నోను వదిలేసి అయోధ్యకు ఎందుకు వచ్చారు? అంతకుముందు ఆయన బాబ్రీ నిర్మాణానికి ఏ హానీ కలగదని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి రాలేదా? ఆడ్వాణీ వంటి పరిపూర్ణ నేతకు, మురళీ మనోహర్ జోషి వంటి ప్రొఫెసర్‌కు తెలియదా? అయినా ఎందుకు వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు? బాబరీని కొందరు సంఘవ్యతిరేక శక్తులు కూల్చడానికి వెళుతూ ఉంటే భారత రాజ్యాంగం పట్ల అవిరళ శ్రద్ధతో సంఘ్‌పరివార్ సభ్యులుగా ఆపడానికి వచ్చారా? ఒక్కరంటే ఒక్కరు కోర్టుకు వచ్చి తాము రామజన్మభూమిలో బాబరీ మసీదు ఉండకూడదనే ఉద్దేశంతో దాన్ని కూల్చేయడానికి వెళ్లామని, అక్కడ రామమందిరం కట్టడం కోసం దాన్ని కూల్చేయక తప్పలేదని కోర్టులో సత్యం ఎందుకు చెప్పలేదు.
‘‘అవును మేమే కూల్చాం, మందిరం కట్టడానికి’’ అనే నిజం చెప్పే ధైర్యం ఒక్కరికీ లేదా? అయోధ్య రామజన్మభూమి అని కోటానుకోట్ల హిందువులు నమ్మే చోట ఒకమసీదు ఎలా వచ్చిందో ఎవరూ న్యాయస్థానం నమ్మే రుజువులతో సహా చెప్పలేరు. బాబ్రీ కట్టడం 1992 డిసెంబర్ 6 నాడు ఎందుకు కూలిందో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా ఎవరు కొట్టిన గునపపు దెబ్బకు ఎక్కడ పగిలిందో రుజువులతో సహా చెప్పలేదు. కూల్చింది నిజమే, కాని కూల్చింది ఎవరో రుజువులు లేవు. ఎవరో కూలగొట్టకుండానే ఏదీ కూలదు. కాని సిబిఐ నిందితులని పేర్కొన్న పెద్దలు చిన్నలు ఎవరూ కూల్చినట్టు రుజువులు లేవని సిబిఐ కోర్టు కేసు ముగించింది. వారు కూల్చలేదనలేదు. సాక్ష్యాలు తెచ్చే పని కోర్టుది కాదు. ఉన్న సాక్ష్యం సరిపోతే నేరస్థులనడం, లేకపోతే సాక్ష్యం లేదని వదిలేయడం తప్ప కోర్టుకు ఏ పాపమూ తెలియదు. అయితే పాపులెవరు?
సాక్ష్యాలు సేకరించి కోర్టులో రుజువు చేసే పని పోలీసులది. సాక్ష్యాలు లేవా, దొరకలేదా, దొరికినా కోర్టులో పెట్టలేదా? ఆనాటి టివీలు వీడియోలు తీయలేదా? అవి చూపలేదా? ఎవరూ చూడలేదా? ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, సిబిఐ దర్యాప్తు అధికారులకు కలలో కనిపించాయా? ఏ ఆధారాలు లేకుండానే పెద్దపెద్ద వారి పేర్లను వారు అందులో ఇరికించారందామా? అట్లా అయితే వారి మీద చర్యలు తీసుకోవాలని నిందితులు అడుగుతున్నారా? ఇవన్నీ న్యాయపరమైన ప్రశ్నలు. ప్రజలకు తెలుసు. ఎవరి అంచనాలు వారికుంటాయి.
అక్కడ జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. సంఘటనలను ఇంగ్లీషులో FACTS అంటారు. చట్టపరిభాషలో fact అంటే నిజమూ కాదు వాస్తవమూ కాదు. ఒక సంగతి అని అర్థం. అంతే. బాబ్రీ మసీదు కూలింది అనేది ఒక సంగతి. బిజెపి, విహెచ్‌పి, బజరంగదళ్, విశ్వహిందూపరిషత్, సంఘ్ పరివార్‌కు సంబంధించిన వారు, కరసేవకులుగా దేశం నలుమూలల నుంచి తరలివచ్చినవారు అక్కడ అదే రోజు సమావేశమయ్యారు. వారిలో కొందరు మంచి వారు. మరికొందరు, కోర్టువారు చెప్పినట్టు వారిలోనే ఉన్న సంఘవ్యతిరేక శక్తులు. సంఘ్ శక్తులు కూల్చలేదనీ, సంఘ్‌లోనే లేదా కరసేవకులలోనే ఉన్న సంఘ వ్యతిరేక శక్తులు కూల్చిఉంటాయని 2300 పేజీల తీర్పు సారాంశం.
వారంతా ఆరోజు అక్కడికి ఎందుకు వచ్చారు? బాబ్రీ కట్టడం చుట్టూ షామియానాలు వేసుకుని, అందులో కుర్చీలు వేసుకుని కూర్చోవడానికి వచ్చారా? వారిలో దాదాపు 90శాతం మంది బిజెపి నాయకులు, వేలాది చురుకైన కార్యకర్తలు, అక్కడ మసీదు ఉన్న చోట రామాలయం కట్టాలనే దృఢసంకల్పం ఉన్నవారే నని నేను అనుకుంటున్నాను. కరసేవకులు కూడా నుదుట కాషాయ వస్త్రం కట్టుకుని కరసేవకులమని దుస్తుల మీద రాసుకుని, కుంకుమబొట్లు పెట్టుకుని, కొందరు త్రిశూలలు పట్టుకుని, గునపాలు, పారలు, తట్టలు, బుట్టలు పట్టుకుని ఎందుకు వచ్చారు? అది స్టేడియం కాదు. అక్కడ క్రికెట్ మ్యాచ్ జరగడం లేదు కదా?
వెళ్లిన వారి ఎజెండా ఏమిటి? ప్రకటిత ఎజెండా. మానిఫెస్టో, రామ్‌లల్లా మీద భక్తితో, అదే రామజన్మభూమి అన్న ప్రగాఢ విశ్వాసంతో, అక్కడ భవ్యమైన రామాలయం ఉండేది, ఇకముందు ఉండాలి అన్న దృఢసంకల్పంతో చేసిన ప్రకటనలు లేవా? ఏ ప్లాన్ లేకుండానే అక్కడికి గునపాలతో ఎందుకు వచ్చారు? బాబ్రీ కట్టడాన్ని కూల్చిన తరువాత ఆ శిథిలాలన్నీ ఎవరు ఎత్తిపోశారు? ఎలా ఎత్తిపోశారు? ఎక్కడ ఎత్తిపోశారు? మళ్లీ తాత్కాలిక కప్పు కింద రామ్‌లల్లాను ఎలా నెలకొల్పారు. అంతా యాదృచ్ఛికంగా ముందుగా అనుకోకుండానే జరిగిపోయిందా? ఇవన్నీ సాధారణ బుద్ధి ఉన్న మానవులకు, ఇంగితజ్ఞానం (బహుశా దీన్నే కామనసెన్స్ అంటారేమో) ఉన్నవారికి వచ్చే ప్రశ్నలు. రావలసిన ప్రశ్నలు. అక్కడ ఆరోజు చేరిన ప్రతి వ్యక్తికీ ఆ ప్రాంతంలో రామాలయం రావాలనే ప్రగాఢ కోరిక ఉందని అందరికీ తెలుసు. అక్కడికి వెళ్లి వచ్చినవారిలో ఒక్కరైనా ‘లేదు, అది కాదు’ అని అనగలరా? బాబ్రీ కట్టడాన్ని కూల్చడానికి వారు అక్కడికి వెళ్లలేదని ఒక్కరైనా చెప్పగలరా? లేదా కూల్చుతుంటే చూడడానికి, కూల్చనివ్వడానికి వెళ్లలేదని కుర్చీలు వేసుకుని కూర్చున్న పెద్దలలో ఒక్కరైనా చెప్పగలరా? అక్కడున్నవారెవరికీ అది నాలుగువందల ఏళ్ల నాటి పాత కట్టడమని, చట్టంప్రకారం పురాతన నిర్మాణమని నిర్వచించిన లేదా నిర్వచించవలసిన కట్టడమని, దాన్ని కూల్చడం చట్టప్రకారం నేరమని తెలియదా? హిందూముస్లింల మధ్య మతఘర్షణలకు దారితీసే వివాదాస్పద అగ్గిరవ్వలు అక్కడ చెలరేగే అవకాశం ఉందని తెలియదా? అక్కడున్న యుపి ముఖ్యమంత్రి లక్నోను వదిలేసి అయోధ్యకు ఎందుకు వచ్చారు? అంతకుముందు ఆయన బాబ్రీ నిర్మాణానికి ఏ హానీ కలగదని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి రాలేదా? ఆడ్వాణీ వంటి పరిపూర్ణ నేతకు, మురళీ మనోహర్ జోషి వంటి ప్రొఫెసర్‌కు తెలియదా? అయినా ఎందుకు వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు? బాబరీని కొందరు సంఘవ్యతిరేక శక్తులు కూల్చడానికి వెళుతూ ఉంటే భారత రాజ్యాంగం పట్ల అవిరళ శ్రద్ధతో సంఘ్‌పరివార్ సభ్యులుగా ఆపడానికి వచ్చారా? సమాధానాలు వారికీ తెలుసు, మనందరికీ తెలుసు.
నాకు ఆశ్చర్యం బాధ కూడా కలిగిస్తున్న అంశం ఏమిటంటే, వీరిలో ఒక్కరంటే ఒక్కరు కోర్టుకు వచ్చి తాము రామజన్మభూమిలో బాబరీ మసీదు ఉండకూడదనే ఉద్దేశంతో దాన్ని కూల్చేయడానికి వెళ్లామని, అక్కడ రామమందిరం కట్టడం కోసం దాన్ని కూల్చేయక తప్పలేదని కోర్టులో సత్యం ఎందుకు చెప్పలేదు. అంతటి ధైర్యం సాహసం, అంకితభావం, చిత్తశుద్ధి లేవా?
ఈ పనులను ఏమనాలి? ఆందోళన అనాలా? ప్రభుత్వం అధ్వర్యంలో రాజకీయ పార్టీ నిర్వహించిన భక్తి ఉద్యమం అనాలా? లేక ఇప్పుడు వారంతా నెత్తిన పెట్టుకుని గౌరవిస్తున్న గాంధీ సత్యాగ్రహం అనాలా? (నేడు గాంధీ జయంతి)తనకు ఉరిశిక్ష వేసినా సరే తాను రాముడి గుడికట్టే యజ్ఞంలో భాగస్వామ్యమినైనందుకు సంతోషంతో ఆ శిక్షను స్వీకరిస్తానని నిందితులలో ఒకరైనా ఉమా భారతి అన్నారు. చాలా గొప్పమాట. ఇంకెవ్వరయినా ఆమాట అన్నారో లేదో నాకు తెలియదు. నేరం చేయలేదని ఆమె అనలేదు. బాబ్రీ నిర్మాణం కూల్చలేదనీ అనలేదు. రామమందిర నిర్మాణం తమ లక్ష్యం కాదనీ అనలేదు. అయితే ఆమెకు కూడా ఒక ప్రశ్న. సిబిఐ స్పెషల్ కోర్టు ముందుకు వెళ్లి, తమ లక్ష్యం రామమందిర నిర్మాణమేనని, అందుకు అడ్డుగా ఉన్న బాబ్రీ మసీదును తొలగించుకుంటామని, దానికోసమే తాను వచ్చానని నేరాన్ని ఎందుకు ఒప్పుకోలేదు?
అదే ప్రశ్న ఆడ్వాణీకి కూడా. అందరకీ పేరుపేరునా అదే ప్రశ్న. తీర్పు తరువాత సత్యమే జయించింది అనే అర్హత బిజెపి విహెచ్‌పి, వగైరా వగైరాకు చెందిన వ్యక్తులకు ఉందా? నిజంగా సత్యం జయించిందా? సత్యమేవజయతే అనే భారతదేశ లక్ష్య వాక్యానికి ఇదేనా అర్థం. వీరంతా హైందవ ధర్మాన్ని, రామతత్వాన్ని, భారతీయ సంస్కృతికి వేద సంస్కారానికి మూలసూత్రమైన సత్యవ్రతాన్ని నిలబెట్టిన వారా? ఇదేనా వీరి దేశభక్తి, ఇదేనా వీరి రామభక్తి? రామ్‌లల్లా ఇదే చేయమని చెప్పాడా?
తానూ బాబ్రీ మసీదు కూల్చానని కోర్టుకు వచ్చి చెప్పి జైళ్లన్నీ నింపేస్తాం అనే ధైర్య, ఉద్యమ సాహసాలు ఎవరికీ లేవా? ఇదేనా చిత్తశుధ్ది? రామభక్తికి నిబద్ధం కాకుండా, రాజ్యాంగానికి నిబద్ధం కాకుండా, సత్యానికి నిబద్ధం కాకుండా, పోనీ ఇన్నాళ్లూ చెప్పుకుని రాజకీయంగా ఎదిగిన రామాలయ నిర్మాణ సంకల్పానికి కూడా నిబద్ధం కాకుండా, దేనికి భయపడి బాబ్రీని కూల్చడానికి రాలేదని చెప్పారు? లేదా కూల్చడానికి వచ్చామని ఎందుకు చెప్పలేదు? సిబిఐ కోర్టు వారిని బాయిజ్జత్ నిర్దోషులని చెప్పలేదు. సాక్ష్యం లేక వదిలేసామని చెప్పింది. వారి సత్యం జయించలేదు. సత్యాలకు రుజువులు ఇవ్వక, ఇవ్వనీయకపోవడం వల్ల అసత్యం ఆధారంగా విడుదలయ్యారంతే.
భారత సాక్ష్య చట్టం (ప్రపంచంలో ఏ సాక్ష్య చట్టమైనా) మూడు అంశాలు వివరిస్తుంది. 1. charge proved– నేరం రుజువైంది, శిక్ష పడుతుంది. 2. charge not proved– నేరం రుజువు కాలేదు, కారణం సాక్ష్యాలు లేవు. లేదా సరిపోయేన్ని లేవు. 3. charge disproved– అంటే ఆరోపించబడిన వారు నేరం చేయలేదని రుజువు కావడం, ఆరోపణలు తప్పని రుజువైనాయి అని. రెండో వర్గపు విడుదల నిన్నటి తీర్పు. మిఠాయిలు ఎందుకు పంచుకుంటున్నారు? పూలహారాలు ఎందుకు వేస్తున్నారు, వేసుకుంటున్నారు వేయించుకుంటున్నారు? వాటిని ఎందుకు వద్దనడం లేదు?. సబ్ కో సన్మతి దే భగవాన్, జై శ్రీరాం అని ఎందుకు అంటున్నారు? నిందితులందరికీ సన్మతి అక్కరలేదా?
నిందితులు విడుదల కావడానికి కారణం నిజం కాదు. సిబిఐ అసమర్థత. ఈ మాట కోర్టే అన్నది, నేను కాదు. సత్యం కాదు జయించింది. అసమర్థత జయించింది. ఇక్కడ సత్యం ఓడిపోయింది. సత్యం చెప్సే సాహసం లేని అనైతికత వల్ల నేరం రుజువు కాలేదు. అంతే. వీరంతా అంతరాంతరాల్లో ఉండే అంతరాత్మలను ప్రశ్నించుకోవడం పశ్చాత్తాపం చెందడం ఒక్కటే మార్గం. భారతీయ జాతీయతను, నైతికవిలువలను, నిజాయితీని, నిజాన్ని, సంస్కృతిని, సంస్కారాన్ని రక్షించండి.
మాడభూషి శ్రీధర్