Sunday, 18 June 2017

ముస్లిం రిజర్వేషన్లకు మోదీ సానుకూలం

ముస్లిం రిజర్వేషన్లకు మోదీ సానుకూలం
19-06-2017 00:50:01
http://www.andhrajyothy.com/artical?SID=428030

మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం
అధికారంలో భాగస్వామ్యం కల్పించాం
అభివృద్ధి పనులకు సలహాలివ్వండి: కేసీఆర్‌
ముస్లిం సోదరులకు సీఎం ఇఫ్తార్‌ విందు
హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ముస్లింల రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా ఉన్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో సానుకూలంగా స్పందించారని, రిజర్వేషన్ల అమలుకు సహకరించని పక్షంలో కేంద్రంపై పోరాటం చేసి సాధించుకుందామన్నారు. ముస్లిం మైనారిటీల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. 2022 నాటికి రాష్ట్రంలో 1.33లక్షల మంది ముస్లిం విద్యార్ధులు గురుకుల పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకుని బయటకు రానున్నారని తెలిపారు. ఒక్కో విద్యార్ధి కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.1.25 లక్షల చొప్పున ఖర్చు చేస్తుందని వివరించారు.

రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో ముస్లింలకు కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌సీ, ఎస్‌టీలకు అమలు చేస్తున్నట్టుగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. శాసనసభలో ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి నివేదించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ మొదటి నుంచి బంగారు గని అని, సమైక్య రాష్ట్రంలో సర్వనాశనం చేశారని కేసీఆర్‌ విమర్శించారు. ముస్లింలు సైతం అనేక రకాలుగా అన్యాయానికి గురయ్యారన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నిర్వహించిన సందర్భంలో పలువురు రాజకీయ నాయకులు ప్రత్యేక తెలంగాణ ఎందుకని ప్రశ్నించారని పేర్కొన్నారు. అన్నిరకాలుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన న్యాయధర్మబద్దమైనదని, అందుకే ఉద్యమంతో విజయం సాధించామని అన్నారు.

సరికొత్త విధానాలతో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. 17.18 శాతం అభివృద్ధితో అగ్రస్థానంలో ఉన్నట్టు కేసీఆర్‌ పేర్కొన్నారు. మైనారిటీ ముస్లింలకు అవసరమైన రంగంలో సమాన హక్కులు, భాగస్వామ్యం కల్పించిన పక్షంలో అభివృద్ధి చెందుతారని వివరించారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లింలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించి ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు శాసనమండలిలో నలుగురు ముస్లింలకు అవకాశం కల్పించామని, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌లలో ఐదుగురికి చైర్మన్‌గా అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్‌, వరంగల్‌ కార్పొరేషన్‌లలో డిప్యూటి మేయర్‌ పదవులు ఇచ్చినట్టు తెలిపారు. ఎలకి్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌గా, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ముస్లింలు పనిచేస్తున్నారని వెల్లడించారు. విదేశాల్లో చదువుకునే ముస్లింలకు రూ.20 లక్షలు చొప్పున స్కాలర్‌షి్‌పను అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 595 మందిని ఎంపిక చేసినట్టు వివరించారు.

సివిల్‌ సర్వీసు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు ఉచిత శిక్షణ కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఢిల్లీలో ఉన్నట్టుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామిక్‌ రీసర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి విద్యావంతులు, మేధావులు సూచనలు, సలహాలను నేరుగా, లేఖ ద్వారా తనకు తెలియజేయవచ్చని లేదా ముస్లింల ప్రజాప్రతినిధులు ద్వారా పంపాలని కోరారు. ఉపవాసదీక్షలు కొనసాగిస్తున్న ముస్లింలకు సీఎం కేసీఆర్‌ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సలీం, సెట్విన్‌ చైర్మన్‌ ఇనాయత అలీ బాక్రీ, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ పి.మహేందర్‌రెడ్డి, ముస్లిం మత నాయకులు ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌, ఖుబుల్‌ పాషా సుత్తారి, ఆగా నిస్సార్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.